ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సినిమా ‘వారసుడు’. ఇందులో హీరో విజయ్ కావడమో, నిర్మాత దిల్ రాజు అవ్వడమో తెలియదు గానీ నెటిజన్స్ దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లే పలు కాంట్రరవర్సీలు కూడా ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజు కూడా విజయ్-అజిత్ ని పోల్చుతూ ఓ మాటన్నాడు. ఇది ఇంకా చల్లారే లోపు.. ‘వారసుడు’ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన తెలుగు సినీ ప్రేక్షకులు ఆలోచనలో పడిపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల కల్చర్ బాగా పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా నటీనటులు కూడా పలు భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కలిసి.. తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘వారసుడు’ సినిమా కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి.. ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసేశారు. ఇక ఈ సినిమాకు తెలుగులో ఇచ్చే థియేటర్ల విషయమై గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది.
తాజాగా విజయ్-అజిత్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా నిర్మాత దిల్ రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా ‘వారసుడు’కి తెలుగులో ఎవరు సూట్ కాకపోవడం వల్ల హీరోగా చేయడానికి విజయ్ ని తీసుకొస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆన్సర్ ఇచ్చిన దిల్ రాజు.. ‘వంశీ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఇది మహేశ్ బాబుతో చేద్దాం అనుకున్నాం. ఇంకో సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమైంది. తర్వాత చరణ్ తో అనుకున్నాం. అప్పుడు svc 50 ఫైనల్ కావడం వల్ల చేయలేకపోయాం. అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఆ టైంలో బిజీగా ఉన్నారు. ఎవరు ఫ్రీగా లేరు. అప్పుడు విజయ్ ని కలిశాం. అరగంట స్టోరీ విన్న ఆయనకు నచ్చడం వల్ల సినిమా ఓకే చేశారు’ అని చెప్పుకొచ్చారు.