Vijay Sethupathi: నటన రాదు అని విమర్శలు ఎదుర్కొన్న స్థాయినుంచి నటన అంటే విజయ్ సేతుపతిదే అనే స్థాయికి ఎదిగారు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తన సహజ నటనతో సినిమాను వేరే లెవల్‌కు తీసుకుపోతున్నారు. సినిమా హిట్టా.. ఫట్టా అన్న సంగతి పక్కన పెడితే.. విజయ్ సేతుపతి భలే చేశాడురా అనిపించుకుంటున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న ప్రతీ పాత్రను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రతి నాయకుడి పాత్రలోనూ జనాలను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం డజన్ల కొద్దీ సినిమాలతో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. అలాంటి ఆయన తాజాగా ఓ కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడుతున్న ఆయనకు వారు కోపం తెప్పించారు.
అజిత్ ఫ్యాన్స్ గట్టిగా అరవటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా, విజయ్ సేతుపతి చెన్నైలోని లయోలా కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. శ్రద్ధగా వినటం వల్ల కలిగే లాభాలను చెబుతున్నారు. తమిళ ఆణిముత్యాలు ఉన్న తిరుక్కురల్లోంచి కొన్నింటిని ఉదహరిస్తూ ఉపన్యాసం చేయసాగారు. ‘‘ మీరు చదివేదంతా మీ నిజ జీవితంలో మీకు ఉపయోగపడదు. రకరకాల మనుషులతో మీరు పరిచయం పెంచుకోవటం వల్ల.. మీ జ్ఞానం మరింత పెరుగుతుంది. ఇతరులపై వెంటనే మీరు మీ కోపాన్ని చూపించకండి. నేను గతంలో కోప్పడిన వాళ్లే ఇప్పుడు నా ఫ్రెండ్స్‌గా ఉన్నారు. మీరు శారీరకంగా ఎదిగినంత మాత్రాన.. మానసికంగా ఎదిగినట్లు కాదు.
వ్యాపార ప్రపంచం మీ సమయాన్ని దొంగిలించాలని చూస్తోంది. మీ సృజనాత్మకతను వాడుకోవాలని చూస్తోంది. సోషల్ మీడియా ఇచ్చే నకిలీ స్వేచ్చను నమ్మకండి’’ అని అన్నారు. ఆ తర్వాత ఆయన తల గురించి ప్రస్తావించారు. మనిషికి తల ఎంత ముఖ్యమో చెబుతూ ఉన్నారు. అయితే, విజయ్ సేతుపతి తల అని అనగానే విద్యార్థుల్లోని అజిత్ ఫ్యాన్స్ గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దీంతో విజయ్ సేతుపతి ‘‘ అనవసరంగా అరవకండి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం.. మీరు ఏం అరుస్తున్నారు. పోండయ్యా!’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కొద్ది క్షణాలు ఆగి మళ్లీ ఆయన తిరుక్కురల్ గురించి చెప్పటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.