సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ జరిగినా ఎవరెవరు ఏమేం అవార్డులు గెలుచుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా తమ అభిమాన హీరోహీరోయిన్లకు అవార్డులు రావాలని అందరి ఫ్యాన్స్ కోరుకుంటారు. తాజాగా సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ అవార్డు సైమా(siima) 2021 వేడుకలు బెంగుళూరులో జరిగాయి. గతేడాది ఏయే సినిమాలైతే థియేటర్స్ లో సందడి చేశాయో చాలా సినిమాలు, చాలామంది నటీనటులు అవార్డులు అందుకున్నారు. అయితే.. ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సైమా స్పెషల్ అవార్డు అందుకొని అందరిని సర్ప్రైజ్ చేశాడు. లైగర్ ప్లాప్ తర్వాత మొదటిసారి సైమా వేదికపై కనిపించాడు విజయ్.
ఇక ‘యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా’ అవార్డును విజయ్ కి అందజేశారు. ఈ క్రమంలో అవార్డు అందుకున్న విజయ్.. స్టేజిపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ మాట్లాడుతూ.. “సైమా అవార్డులు అందుకున్న వారందరికీ కంగ్రాట్స్. మంచి సినిమాలతో ఈ ఏడాది ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ ఏడాది నేను కూడా ట్రై చేశాను. ఎంతో కష్టపడ్డాను.. కానీ కుదరలేదు. మనందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు అన్నీ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం అనుకున్న పనులను కరెక్ట్ గా పూర్తిచేయాలి. నిజానికి నేను ఈ వేడుకకు రావొద్దని అనుకున్నా. కానీ.. మీ అందరికీ ఓ మాట చెప్పడానికి వచ్చాను. నేను మిమ్మల్ని అలరించేందుకు మరింత కష్టపడతాను” అని చెప్పుకొచ్చాడు విజయ్.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ ఈ ఏడాది పాన్ ఇండియా మూవీ లైగర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక లైగర్ తర్వాత విజయ్.. డైరెక్టర్ శివ నిర్వాణతో ఖుషి మూవీ చేస్తున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత విజయ్ మళ్లీ ఆ స్థాయి హిట్స్ అందుకోలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన విజయ్ కి దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మరి ప్రస్తుతం లైనప్ చేసిన సినిమాలతోనైనా విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.