కొద్దికాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల సినీ ప్రముఖుల మరణాలను మరవకముందే తాజాగా బుల్లితెర నటి వైశాలి టక్కర్ మృతిచెందిన వార్త అందరినీ విషాదంలో ముంచింది. ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ.. తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒక్కసారిగా టీవీ పరిశ్రమను షాక్ కి గురిచేసింది. అయితే.. ఇండోర్ లోని తేతేజి నగర్ పోలీసులు వైశాలి మరణంపై కేసు నమోదు చేశారు. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న వైశాలి.. ఏడాది నుండి ఇండోర్ లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మధ్యే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న వైశాలి.. 29 ఏళ్లకే అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా బిజీ అవుతున్న నటి ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడటం.. ఆమె సహనటులు, ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. వైశాలి మరణించిన వార్తను తెలుసుకొని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం. దీంతో వైశాలి మృతి వెనుక మరో కోణం వెలుగులోకి వచ్చిందని సినీవర్గాలు చెబుతున్నాయి. వైశాలి సూసైడ్ నోట్ గమనిస్తే ఆమె మానసిక క్షోభ కారణంగానే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.
ఇంతకీ వైశాలి సూసైడ్ నోట్ లో ఏం రాసింది అనంటే.. తనను రెండున్నరేళ్లుగా పక్కింట్లో ఉండే రాహుల్ అనే వ్యక్తి మానసికంగా వేధిస్తున్నాడని.. తాను చనిపోయాక రాహుల్ ని, అతని భార్యని శిక్షించడం మర్చిపోవద్దని.. తన చావుకి రాహులే కారణమని తన తల్లిదండ్రులకు లేఖలో చెప్పుకొచ్చింది వైశాలి. ఈ నేపథ్యంలో అసలు రాహుల్ ఎవరు అని ఆరా తీయగా.. వైశాలి మాజీ ప్రియుడని కామెంట్స్ వినిపిస్తున్నాయట. అదీగాక వైశాలి చివరి ఇన్ స్టాగ్రామ్ వీడియోలో కూడా తాను బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయినట్లు చెప్పిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. వైశాలి ససురాల్ సిమర్ కా సీరియల్ తో పాటు సూపర్ సిస్టర్స్, యే రిష్టా క్యా కెహతా హై, యే వదా రహా, యే హై ఆషికీ లాంటి పాపులర్ మెరిసింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైశాలి మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు నెటిజన్స్, ఫ్యాన్స్.