ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమౌతోన్న వినోద కార్యక్రమం జబర్థస్త్. ఇటీవలే 500ల ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది జడ్జస్ మారిపోయారు. యాంకర్ అనసూయ ప్లేస్ లో సౌమ్య రావ్ వచ్చి చేరారు. కంటెస్టెంట్లు మారిపోయాయి. కానీ షో ఆరంభం నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్లలో కనిపించిన ఏకైక కంటెస్టెంట్ రాకెట్ రాఘవ. తనదైన పంచ్ డైలాగులతో ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్విస్తారు.
కమెడియన్ గా బుల్లితెరలోనే కాకుండా వెండి తెరలోనూ తన నవ్వులతో మెప్పిస్తున్న రాఘవ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇదే సమయంలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి విషయంలో తనకు తెలియకుండానే చేసిన ఓ తప్పు వల్ల ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నానని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లు ఏమీ చేయకుండా ఉండిపోయానని, ఏం చేస్తావని తన తండ్రి అడిగితే, ఆరు నెలల సమయం అడిగానని చెప్పారు. నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చానన్నారు. వచ్చిన కొత్తలో సీరియల్ నటుడు శ్రీరామ్ తనకు ఎంతో సాయం చేశాడని చెప్పారు. తన సాయాన్ని మర్చిపోలేనన్నారు.
నటుడు, కమెడియన్ శ్రీనివాసరెడ్డి సైతం తనను ఎంతో ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయనతో కలిసి అనేక షోలు, సినిమాలు చేశానని చెప్పారు. అయితే ఆయన విషయంలో చేసిన తప్పు పట్ల ఇప్పటికీ గిల్టీగా ఫీలవుతున్నానని తెలిపారు. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే నవ్వుల సవాల్ కు శ్రీనివాసరెడ్డి యాంకర్ గా వ్యవహరించేవారు. ‘ఓ రోజు ఆ కార్యక్రమానికి చెందిన డైరెక్టర్ నన్ను పిలిచి.. ఈ షో నువ్వు చేస్తావా అని అడిగారు. నేను వెనుక ముందు ఆలోచించకుండా ఎస్ చెప్పాను. ఓ ఎపిసోడ్ షూట్ కూడా జరిగిపోయింది. అయితే ఈ విషయం తెలియని శ్రీనివాస రెడ్డి అక్కడకు వచ్చి.. పరిస్థితి తెలుసుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు‘ అని తెలిపారు.
ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయమని నిన్ను అడిగారా అని శ్రీనివాసరెడ్డి తనను అడిగినట్లు రాఘవ చెప్పారు. అవునని చెప్పాక.. మరీ ఆ విషయం నాకు వాళ్లు చెప్పాలి కదా.. కనీసం నువ్వైనా చెప్పాలిగా అన్నారు. వాళ్లు నాకు ఇవ్వాల్సిన పెండింగ్ పేమెంట్ ఉంటుందని చెప్పారన్నారు. ఇలా తనకు తెలియకుండానే శ్రీనివాసరెడ్డి విషయంలో ఈ కార్యక్రమాన్ని తాను చేసి పెద్ద తప్పు చేశానని, ఇప్పటికీ ఆయన పేరు తలచుకుంటే.. మనస్సు ఏదోలా అయిపోతుందని అన్నారు.