కరోనా కష్టకాలంలో కుదేలైన సినీ ఇండస్ట్రీకి ఇంకా కష్టాలు తప్పడం లేదు. వరుస విషాద ఘటనలు టాలీవుడ్ కి షాక్ ఇస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి మరో విషాద ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 64 ఏళ్ళు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గిరిధర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంతో ఆయన నడవలేని స్థితికి చేరుకుని, అప్పటి నుండి మంచానికే పరిమితమయ్యారు. ఇక.. చివరికి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో గిరిధర్ తుదిశ్వాస విడిచారు.
గిరిధర్ ది చిత్తూరు జిల్లా. పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఆయన జన్మించాడు. చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి. దీంతో.., 1982లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు.
ఇక గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కో- డైరెక్టర్‌గా వ్యవహరించారు. అప్పట్లో శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ.., గిరిధర్ దర్శకుడిగా కన్నా.., నటుడుగానే ఎక్కువ గుర్తింపు దక్కించుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు వంటి చిత్రాలు గిరిధర్ కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇక సీనియర్ నటుడైన గిరిధర్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.ఇక ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనము కోరుకుందాం.