Vishal: ప్రముఖ తమిళ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హీరో విశాల్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని అన్నా నగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ఓ ఎర్ర కారు ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ వెంటనే కొంతమంది కారులోంచి దిగి విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇంటికి సంబంధించిన అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విశాల్ మేనేజర్ చెన్నై కే4 అన్నానగర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇక, హీరో విశాల్ రాళ్ల దాడి జరిగిన సమయంలో ఇంట్లో లేరని తేలింది. సినిమా షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారని సమాచారం. ప్రస్తుతం హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు? ఎందుకు? రాళ్ల దాడి చేశారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కాగా, నటుడు విశాల్ ‘వీరమే వాగై సూడుమ్’ సినిమా సమయంలో విశాల్ లైకా ప్రొడక్షన్ దగ్గర రూ. 21 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
ఆ సమయంలోనే సినిమా రైట్స్ లైకా ప్రొడక్షన్‌కు ఇచ్చేటట్లు ఒప్పందం కూడా కుదిరింది. అయితే, విశాల్ ఆ సినిమా రైట్స్‌ను లైకాకు ఇవ్వలేదు. దీంతో లైకా కోర్టును ఆశ్రయించింది. కోర్టు 6 నెలల్లో 15 కోట్ల రూపాయలు చెల్లించాలని విశాల్‌ను ఆదేశించింది. కోర్టు చెప్పినట్లు అతడు చేయకపోవటంతో మరోసారి లైకా ప్రొడక్షన్ కోర్టును ఆశ్రయించింది. కొద్దిరోజుల క్రితం విశాల్ కోర్టు ముందు హాజరయ్యారు. తాను అప్పుల్లో కూరుకుపోయి ఉన్నానని, ఆస్తులు కూడా ఏవీ లేవని విశాల్ కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న కోర్టు విశాల్ తన ఆస్తి వివరాలను తెలపాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి : కృష్ణ-విజయనిర్మల వివాహానికి ఇందిరా దేవి అంగీకారం తెలపడానికి కారణం?