ప్రముఖ ఇండియన్ సింగర్ సురేన్ ఎమ్‌నమ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 35 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. సురేన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణిపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆయన బెడ్‌పై ‘‘ అల్లాహా్ కే బంధే’’ అనే పాటను పాడుతూ కన్నుమూశారు. ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ప్రముఖ మణిపూర్ సింగర్ సురేన్ ఎమ్‌నమ్ నిన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఎల్లప్పుడూ మన పెదాలపై చిరునవ్వు ఉండాలన్న మెసెజ్ ఆయన మనకు ఇచ్చారు. ఈ వీడియోను చూసినపుడు నాకు చాలా బాధేసింది. అతడు బతకాలని ఎంతో ప్రయత్నించాడు. సురేన్ కిడ్నీ వ్యాధి నివారణ కోసం మణిపూర్ ప్రజలు 58,51,270 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మణిపూర్ ప్రజల్ని ఆ దేవుడు చల్లగా దీవిస్తాడు’’ అని పేర్కొన్నారు. కాగా, సురేన్ కడు పేదరికానికి చెందిన వ్యక్తి. తనకు ఎంతో ఇష్టం అయిన సింగింగ్‌పై పట్టు సాధించాడు. తన అద్భుతమైన గాత్రంతో మణిపూర్‌లోనే స్టార్ సింగర్‌గా ఎదిగాడు.
అయితే, కిడ్నీల వ్యాధికి పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు అవుతుండటంతో అతడికి ఏం చేయాలో తెలియలేదు. ఈ నేపథ్యంలోనే తనకు సహాయం చేయాలని ప్రజల్ని కోరాడు. అతడి విజ్ఞప్తికి మణిపూర్ ప్రజలు కదిలిపోయారు. అతి తక్కవ టైంలో 58,51,270 రూపాయలని విరాళాలుగా అందజేశారు. అయితే, అంత పెద్ద మొత్తం అందినా కూడా.. ఆయన ప్రాణాలు నిలవకపోవటం విషాదకరం. సురేన్ మృతితో ఆయన కుటుంబంతో పాటు మణిపూర్ సంగీత పరిశ్రమలో కూడా విషాదం నెలకొంది. ఇక, సురేన్ అభిమానులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నారు.