తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఆమె పాటలు పాడారు. అయినా ఆమెకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. గుర్తింపుతో పాటు అవార్డులు కూడా రాకపోవటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘నీదారి పూలదారి.. పోవోయి బాటసారి..’ ‘రేపటి పౌరులం.. రేపటి పౌరులం..’ ‘ఆకతాయి చిన్నోడు..’ ఈ పాటలు పాడింది ఎవరో మీకు తెలుసా?.. బహుశా తెలియపోయి ఉండొచ్చు. ఆ సింగర్ ఈ పాటలు మాత్రమే కాదు.. హిట్లుగా నిలిచిన ఎన్నో పాటల్ని పాడారు. 1960-90 మధ్య కాలంలో తన గాత్రంలో అందరినీ ఉర్రూతలూగించారు.
ఆమే.. ఒకప్పటి స్టార్ సింగర్ బి. రమణ. ఈమె తెలుగులోనే కాదు.. సౌత్ భాషలన్నిటిలోనూ పాటలు పాడారు. ఇప్పటి వరకు కొన్ని వేల పాటలు పాడారు. అయినా ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు. గుర్తింపు మాత్రమే కాదు.. అవార్డులు కూడా రాకపోవటం గమనార్హం. ఈ విషయాన్నే ఆమే స్వయంగా చెప్పుకుని బాధపడ్డారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సరైన గుర్తింపుతో పాటు అవార్డులు కూడా రాకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. బి. రమణ మాట్లాడుతూ..
చిన్నప్పటి నుండి పాటలు పాడడమంటే తనకు ఇష్టమని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేదని, సెకెండ్ ప్రైజ్ ఇష్టపడేదాన్ని కాదని ఆమె అన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో మంచి మంచి పాటలు పాడానని వెల్లడించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో చాలా డ్యూయెట్ సాంగ్స్ పాడానని, బాలు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారని రమణ తెలిపారు. తనకు మంచి గుర్తింపు, అవార్డులు రాకపోవటం బాధాకరమన్నారు. తాను ఎందరినో కళ్లారా చూస్తే చాలనుకున్నానని, అలాంటిది వారితో కలిసి పాటలు పాడానని సంతోషం వ్యక్తం చేశారు. అదే తనకు దక్కిన గౌరవం, తృప్తి అని ఆమె అన్నారు.