హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటి షెహ్‌నాజ్ గిల్ తండ్రి సంతోక్ సింగ్ సుఖ్‌కు బెదిరింపులు వచ్చాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని చంపుతామని ఫోన్ ద్వారా బెదిరించారు. దీపావళిలోగా హత్య చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. షెహ్‌నాజ్ గిల్ తండ్రి సంతోక్ సింగ్ తాజాగా బియాస్‌నుంచి టరంటాన్ బయలు దేరాడు. మార్గం మధ్యలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఓ ఫారెన్ నెంబర్‌నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆయన కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. అవతలినుంచి కొంతమంది యువకుల గొంతులు వినపడ్డాయి. ఆ యువకులు సంతోక్ సింగ్‌ను బూతులు తిట్టడం మొదలు పెట్టారు. దీపావళి కంటే ముందే ఆయన్ని చంపుతామని వాళ్లు బెదిరించారు. ఇంట్లోకి ప్రవేశించి మరీ ఈ దారుణానికి ఒడిగడతమన్నారు.
దీంతో సంతోక్ భయపడిపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తనకు వచ్చిన చావు బెదిరింపు కాల్స్ గరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంతకు ముందు కూడా సంతోక్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. బీజీపీలో చేరిన కొత్తలో ఈ దాడి జరిగింది. 2021 డిసెంబర్ నెలలో సంతోక్ బీజేపీలో చేరారు. తర్వాత కొద్దిరోజులకు ఓ డాబా దగ్గర ఆయనపై గన్ ఫైరింగ్ జరిగింది. సంతోక్ త్రుటిలో తప్పించుకున్నారు. కాగా, షహ్‌నాజ్ గిల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతి బాబు కలిసి నటిస్తున్న ‘‘కబీ ఈద్.. కబీ దివాలీ’’ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆమె మొదటి హిందీ సినిమా కావటం విశేషం.