ఇటీవల ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు అటు సినీ సెలబ్రిటీల కుటుంబాలను, ఇటు అభిమానులకు కలచివేస్తున్నాయి. తాజాగా తెలుగు సినీ, సీరియల్ నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. త్రినయని సీరియల్ ఫేమ్ విష్ణుప్రియ.. తన తండ్రి శ్రీనివాస్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొండంత సపోర్ట్ ని కోల్పోయానని ఎమోషనల్ అయ్యింది. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తాను చేసే పనిలో ఎల్లప్పుడూ తన తండ్రి ఆశీర్వాదాలు ఉంటాయని.. ఆయనే తన సూపర్ హీరో తెలిపింది.
ఇక కామెర్ల కారణంగా తన తండ్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వారం రోజులపాటు చికిత్స తీసుకున్నారని.. అయినా లాభం ఉపయోగం లేకుండా పోయిందని.. అప్పటికే ఆయన ఆరోగ్యం పరిస్థితి చేయిదాటి పోయిందని భావోద్వేగానికి గురైంది. ఇక తన తండ్రి చెంత ఎంతో అపురూపంగా పెరిగిన విష్ణుప్రియ.. ప్రస్తుతం తన తండ్రిని చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక తెలుగుతో తమిళంలో కూడా విష్ణుప్రియకి మంచి పేరుంది. తమిళ, తెలుగు సినిమాలతో పాటు రెండు భాషల సీరియల్స్ లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
ఇదిలా ఉండగా.. విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నటిగా అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు, త్రినయని సీరియల్స్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరోవైపు తమిళంలో ‘నీరమ్ మారత పూక్కల్’ అనే సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలో ఇప్పుడు తన తండ్రి దూరమయ్యే సరికి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టి.. తన తండ్రికి నివాళులు అర్పించాలని ఫ్యాన్స్ ని కోరింది. దీంతో తెలుగు, తమిళ సెలబ్రిటీలతో పాటు అభిమానులు విష్ణుప్రియ తండ్రి మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.