తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే తనదైనశైలిలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సుధ.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. తల్లిగా, అక్కగా, చెల్లిగా ఇలా ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు. టాలీవుడ్ లో ఉన్న అందరు టాప్ హీరోలతో నటించిన సుధ.. అప్ కమింగ్ యంగ్ హీరోలతో సైతం నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. హీరోలు, హీరోయిన్లు మాదిరిగానే సుధకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ నటి సుధ ఎమోషనల్ అయ్యారు. తాను నాలుగు తరాల హీరోలతో నటించానంటూ చెప్పుకొచ్చారు. అలాంటి ఘనత తనకి దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న తారలకు అలాంటి అవకాశం దక్కకపోవచ్చంటూ చెప్పుకొచ్చారు. అలాగే సీనియర్ తో నటించిన సుధ.. తారక్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తారక్ గురించి చెప్తూ బాద్ షా సినిమా షూటింగ్ సమయం అప్పటి ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పుడు తారక్ ఎలా ప్రవర్తించాడు, తాను అసలు ఇంత గొప్ప స్టార్ ఎలా అయ్యాడు అనే విషయాలను పంచుకున్నారు.
“తారక్ ఎంతో గొప్ప నటుడు. నిజానికి వారు అని చెప్పాలి. కానీ, నా కొడుకులాంటి వాడు కాబట్టి నేను వాడు అంటున్నాను. తారక్ చాలా అల్లరి పిల్లాడు. సెట్ లోకి వస్తున్నాడు అంటే గోలగోల చేసేవాడు. ఇప్పుడు ఆ అల్లరి అలాగే ఉంది.. కానీ, హుందాగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికి తారక్ ఎంతో మారిపోయాడు. అతను చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. బాద్ షా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. నేనూ తారక్ కలిసి డాన్స్ చేసే సీన్. మొదటి టేక్ బాగా వచ్చింది.
కానీ, ఎందుకో నేను వన్ మోర్ కి వెళ్దామని చెప్పాను. తారక్ మొదటిదే బాగా వచ్చింది.. మళ్లీ ఎందుకు అని చెప్పాడు. అయినా ఎందుకో వెళ్దామని చెప్పాను. అప్పుడు ప్రాక్టీస్ చేస్తుండగా నా కాలు స్లిప్ అయ్యి బెణికింది. వెంటనే కాలు వాచిపోయింది. అది చూసి జూనియర్ ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేసి జాగ్రత్తగా కూర్చోబెట్టాటు. అంత గొప్ప స్టార్ కి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఏ బాబు చూడండమ్మా అని చెప్పచ్చు. చాలా మంది చూసీ చూడనట్లు వెళ్లిపోతారు. కానీ, తారక్ అలాంటి వ్యక్తి కాదు. ఆ భగవంతుడు జూనియర్ ఎన్టీఆర్ ని చల్లగా చూడాలి” అంటూ నటి సుధ ఎమోషనల్ అయ్యారు.