సినిమాల్లో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉంటారు. పాత సినిమాల్లో రమా ప్రభ, గిరిజ, ఆ తర్వాత శ్రీలక్ష్మి, వై విజయ కామెడీ పాత్రలు చేయగా.. ఆ తర్వాత కాలంలో వారి స్థానాన్ని భర్తి చేసింది నటి కల్పన రాయ్. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 400 పైగా చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా హిట్లర్, చాలా బాగుంది చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అయితే కల్పన రాయ్ పేరు వినగానే.. చాలా మంది ఆమె తెలుగు నటి కాదని భావిస్తారు. కానీ అది అవాస్తవం. కల్పన రాయ్ తెలుగు మహిళ. ఆమె స్వస్థలం కాకినాడ. మరి పేరు చివర్లో రాయ్ అని ఎందుకు ఉందంటే.. దానికో పెద్ద కథ ఉంది. అది తర్వాత చెప్పుకుందాం. ఇక కల్పన రాయ్ జీవితాన్ని గమనిస్తే.. ధనవంతులు ఇంట పుట్టిన ఆమె.. దాన ధర్మాలు చేస్తూ.. పొదుపు అనే మాటే పట్టించుకోలేదు. ఫలితంగా ఆఖరి దశలో అంత్యక్రియలకు చూడా డబ్బులు లేని దీన స్థితిని చూడాల్సి వచ్చింది. ఆ వివరాలు..
కల్పన రాయ్ సొంత ఊరు కాకినాడ. ఆమె అసలు పేరు సత్యవతి. అయితే సినిమాల్లోకి వచ్చాక కల్పనగా మార్చుకున్నారు. ఇక ఆమె పేరులోని రాయ్ వెనక ఓ కథ ఉంది. అందేంటంటే.. కాకినాడలో ఉన్న సమయంలో కల్పన.. మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో అతడి పేరునే తన పేరుగా మార్చుకుని.. కల్పన రాయ్‌గా మారింది. ఇక హీరోయిన్ శారద అంటే కల్పన రాయ్‌కు ఎంతో అభిమానం. పైగా శారదతో కల్పన రాయ్‌కు ఉన్న పరిచయం, సాన్నిహిత్యం కారణంగా.. ఆమె సలహా మేరకు సినిమాల్లోకి వచ్చింది కల్పన రాయ్. ఇక సినిమాల్లో దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో వెంకటేష్.. కల్పన రాయ్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించారు.
కల్పన రాయ్‌కు ఓ కుమార్తె ఉంది. అయితే ఆమె తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటనతో కల్పన రాయ్ బాగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు. దీనికి తోడు.. కల్పన రాయ్‌కు డబ్బు మీద వ్యామోహం లేదు. సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా ఆమె విపరీతంగా దానధర్మాలు చేసేవారు. ఆ అలవాటును సినిమాల్లోకి వచ్చాక కూడా కొనసాగించారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా.. అడిగిన వారికల్ల దానం చేస్తూ పోయి.. చివరకు తన ఆఖరు రోజుల్లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. మరోవైపు డయాబెటీస్ బారిన పడటం.. దాన్ని పట్టించుకోకపోవడంతో.. ఆరోగ్యం క్షీణించింది.
ఆ సమయంలో చూసుకునేవారు ఎవరు లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దీన స్థితిలో ఉన్నారు కల్పన రాయ్. దాంతో ఇండస్ట్రీకి చెందిన కొందరు ముందుకు వచ్చి.. తమ సొంత ఖర్చుతో కల్పన రాయ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. ఎంతో ధనవంతురాలైన కల్పన రాయ్.. అంత్యక్రియలకు కూడా డబ్బు లేని స్థితికి రావడం చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.