1980, 90 దశకంలో యావత్ సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత మరణం.. అప్పటికీ, ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. ఆమె అప్పులపాలై చనిపోయిందని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె చావుకు అప్పులు కారణం కాదని, ఆమెది హత్య అయి ఉండవచ్చునన్న అనుమానాలు ఇప్పటికీ కొంతమందికి ఉన్నాయి. తాజాగా సిల్క్ స్మితది హత్యనా? లేక ఆత్మహత్యనా? అనే విషయం మీద సీనియర్ నటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సిల్క్ స్మిత ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ 1980, 90 దశకంలో పుట్టినోళ్లకి ఆమె గురించి తెలుస్తుంది. తన నిషా కళ్ళతో సినీ ప్రేక్షకులను మత్తులో తూలేలా చేసిన నటి. తన అందచందాలతో ప్రేక్షకులను సినీ ఊయలలో నిద్రపుచ్చిన సొగసరి. ఎన్నో సినిమాల్లో గ్లామరస్ పాత్రలు, డీ గ్లామరస్ పాత్రలు చేసిన అలనాటి నటి సిల్క్ స్మిత. అయితే ఎక్కువగా ఆమె గ్లామరస్ పాత్రలు, వాంప్ పాత్రలు, బార్ గర్ల్ పాత్రలు, ఐటం సాంగ్స్ డ్యాన్సర్ పాత్రలు చేసేది. ఎంతో పేరు, డబ్బు సంపాదించుకున్న ఆమె చివరకు అప్పుల పాలై మరణించింది. ఈమె జీవితం ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ పేరుతో సినిమా వచ్చింది కూడా. ఇటీవలే నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమాలో కూడా సిల్క్ స్మిత పోస్టర్లు కనబడతాయి.
ఈ సినిమాలో కథ కూడా అప్పటి తరానికి చెందినదే కాబట్టి ఊళ్లోనూ, కల్లు దుకాణం బయట సిల్క్ స్మిత పోస్టర్ ఉంటుంది. బార్ పేరు కూడా సిల్క్ పేరు మీదనే ఉంటుంది. ఈ సినిమా దర్శకుడు ఓదెల శ్రీకాంత్ కూడా అప్పట్లో సిల్క్ స్మిత అభిమాని అంట. అందుకే సినిమాలో సిల్క్ స్మిత ఇమేజ్ ను వాడుకున్నారు. అంతలా సిల్క్ స్మిత.. వ్యక్తిగతంగా అందరి అభిమానాలను గెలుచుకుంది. సినిమాల్లో వేసే పాత్రలు వేరు.. ఆమె నిజ జీవితంలో ఆమె వ్యక్తిత్వం వేరు అని చెబుతుంటారు. తాజాగా సిల్క్ స్మిత మరణంపై సీనియర్ నటి కాకినాడ శ్యామల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాకినాడ శ్యామల దాదాపు 200 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఈమె నటిగానే కాకుండా నిర్మాతగా, ఫైనాన్షియర్ గా కూడా వ్యవహరించారు.
సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె సిల్క్ స్మిత గురించి మాట్లాడారు. ఒకే ఒక్క సినిమా చేసిందని.. ఆ సినిమాతో సర్వం కోల్పోయిందని అన్నారు. అయితే మళ్ళీ కోలుకుందని, ఎందుకు చనిపోయిందో దేవుడికే తెలియాలి అని అన్నారు. సిల్క్ స్మిత సినిమాల్లో చేసే పాత్రలు అలాంటివి గానీ వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి అని అన్నారు. సిల్క్ స్మితది కొంతమంది హత్య అంటారు, కొంతమంది ఆత్మహత్య అంటారు. పైవాడికి తెలుసు. అది ఎవరు చేశారో? ఎవరు చేయించారో. పైనున్న వాడు ఖచ్చితంగా చూస్తాడు. ఈరోజు కాకపోయినా ఏరోజైనా శిక్ష అనేది ఉంది. సినిమా కోసం అప్పు చేసింది, తిరిగి అప్పులు చెల్లించేసింది. నిలబడింది. కానీ ఎందుకు చనిపోయిందో అనేది తనకి తెలియదని అన్నారు.