యశస్వి కొండెపుడి.. తెలుగు సంగీత ప్రపంచ ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సరిగమప సింగింగ్ షోలో శర్వానంద్ నటించిన జాను మూవీలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడాడు యశస్వి. ఈ పాటతో ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యశస్వి. అదీకాక తన గాత్రంతో సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ కూడా గెలిచాడు. దాంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు యశస్వి. అయితే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు యశస్వి. తనది కాని స్వచ్చంద సంస్థను తానే నడుపుతున్నానని చెప్పుకుని మోసానికి పాల్పడ్డట్లు ఓ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఆరోపణలు చేస్తోంది.
సరిగమప సింగర్ యశస్వి.. ఒకే ఒక్క పాటతో.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దాంతో అతడికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ అవకాశాలతో పాటు సెలబ్రిటీ హోదా కూడా యశస్వికి దక్కింది. అయితే ఈ సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని చీటింగ్ చేశాడని ఆరోపణలు చేస్తోంది ‘నవసేవ ఫౌండేషన్’ నిర్వహకురాలు ఫరా కౌసర్. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఓ NGOను నడుపుతున్నానని, ఆ ఎన్జీవో ద్వారా సుమారు 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పుకొచ్చాడని కౌసర్ తెలిపింది. అయితే ఇది నిజం కాదని ఆ సంస్థను తానే నడుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.
ఫరా కౌసర్ మాట్లాడుతూ.. “నేను గత 5 సంవత్సరాలుగా నవసేవ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలకు చదిస్తున్నాను. అయితే సింగింగ్ షోలో ఓట్లు రాబట్టేందుకు నవసేవను తానే నడిపిస్తున్నానని యశస్వి చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి నేను అతడిని స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పాలని కోరాను. కానీ అతడు పట్టించుకోలేదు” అని కౌసర్ తెలిపింది. నేను చేస్తున్న సేవను అతడు చేస్తున్నట్లు ఎలా చెప్పుకుంటారు అని కౌసర్ ప్రశ్నించారు. ఈ విషయంపై తర్వలోనే యశస్విపై, టీవీ ఛానల్ పై, యాంకర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఫరా కౌసర్ చెప్పుకొచ్చారు. మరి యశస్విపై ఫరా కౌసర్ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.