సీనియర్ తెలుగు నటుడు శరత్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే..
సీనియర్ తెలుగు నటుడు శరత్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. శరత్ బాబు బంధువులు, సినీ ఇతర వర్గాల మిత్రులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శరత్ బాబు సోదరుడు ఆయన పార్థివ దేహానికి తలకొరివి పెట్టారు. శరత్ బాబుకు సంతానం ఎవ్వరూ లేకపోవటంతో సోదరుడు తల కొరివి పెట్టాల్సి వచ్చింది. ఇక, నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు శరత్ బాబు పార్థివ దేహాన్ని హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో ఉంచారు.
ఆ తర్వాత చెన్నై తరలించారు. కాగా, నటుడు శరత్ బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మే 22, సోమవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మరణించారు. శరత్ బాబు మరణంపై తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
శరత్ బాబు తన కెరీర్‌లో తెలుగు, తమిళం భాషల్లో మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. రామరాజ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 22 ఏళ్ల వయసులో నటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొద్ది కాలానికే విడాకులు తీసుకుని విడిపోయారు. శరత్ బాబు చివరి సారిగా.. నరేష్-పవిత్ర లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’లో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.