ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యం, ఇతర కారణాలతో పలువురు ప్రముఖులు కన్నుమూశారు. వారి మరణం.. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్ర వేదనకు గురిచేసింది. ఇటీవలే 24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బెంగాలీలో పలు చిత్రాలో నటించిన ఆండ్రిలా చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెండు సార్లు క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా ఆమె చివరికి మరణాన్ని జయించలేకపోయింది. ఆదివారం గుండె పోటుతో ఆండ్రిలా శర్మ కన్నుమూసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె అర్ధాంతరం గా మరణించడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక శర్మకు అన్ని వేళలా తోడునీడ ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి… ఆండ్రిలా మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఆమె కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
పశ్చిమ బెంగాల్ లోని బెర్హం పూర్ లో ఆండ్రిలా శర్మ జన్నించారు. ఆమెకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఎంతో ఇష్టపడేది. ఆ ఇష్టం ఆమెను సినీరంగం వైపు మరలించింది. ఈ క్రమంలోనే జమూర్ తో టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహాపీట్ తారపీట్, జిబోనే జ్యోతి, జియోన్ కతి వంటి షోలతో హోస్ట్ గా వ్యవహరించింది. అంతేకాక అమీ దీదీ నెంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లోను ఆండ్రిలా శర్మ నటించింది. ఇలా కెరీర్ సాగుతున్న సమయంలో క్యాన్సర్ ను సోకింది. ఎంతో ధైర్యంతో దానిపై పోరాడి జయించింది. అయితే ఇటీవల గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించింది.
అయితే ఆండ్రిలా చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ దేవుళ్లను ప్రార్ధించాడు. ఆమె కోలుకోవాలని దేవుడి ప్రార్ధించాలని అభిమానలను సైతం సోషల్ మీడియా ద్వారా కోరాడు. అయితే వారి ప్రార్ధనలు దేవుడు ఆలకించలేదు. ఇక ఆమె మరణాన్ని సబ్యసాచి చౌదరి జీర్ణించుకోలేకపోయాడు. ఆండ్రిలా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు సబ్యసాచి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఆమె పార్థివ దేహం వద్ద కాళ్లు పట్టుకుని మరీ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమె పాదాలను ముద్దాడి చివరి వీడ్కొలు పలికారు. అంతే కాకుండా తన సోషల్ మీడియా అకౌంట్ ను కూడా డిలీట్ చేశాడు.