Rashmika Mandanna: సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. తాజాగా, ఆమె ఓ స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేశారు. ఆ సినిమా పేరు ‘‘గుడ్‌బై’’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక నిన్న, మొన్నటి వరకు సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. రష్మిక మాట్లాడుతూ.. ‘‘ నా కుటుంబంతో ఉండలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకో చిట్టి చెల్లెలు కూడా ఉంది. తన వయసు 8 సంవత్సరాలు.
నా చెల్లెలి ఎదుగుదలను చూడలేకపోతున్నాను. అయితే, నాకు ఇంట్లో వారినుంచే కాదు. బయటినుంచి కూడా అంతే ప్రేమ వస్తోంది. నేను వారికి కూడా జవాబుదారీనే. బయట ఉన్న వారికోసం మా కుటుంబం చేస్తున్న త్యాగం ఇది. నేను ఎక్కువగా హాస్టల్స్‌లో ఉన్నాను. అందుకని, నా తల్లిదండ్రులకు దూరంగా ఉండటం నాకు పెద్ద సమస్య కాదు. నాకు చెల్లెలు పుట్టిన తర్వాత కూడా ఇలా దూరంగా ఉండటం అనేది బాగోలేదు. తను పుట్టినపుడు తనను ఎంతో బాగా చూసుకున్నాను. పాలు తాగించేదాన్ని, డైపర్స్ మార్చే దాన్ని, స్నానం చేయించేదాన్ని. నిజంగా చెప్పాలంటే నేను తన రెండో తల్లిని.
అలాంటి తనకు దూరంగా ఉంటూ వస్తున్నాను. అదే నన్ను చాలా బాధిస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆమె తాజాగా చిత్రం ‘గుడ్‌బై’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఇందులో రష్మిక తండ్రిగా అమితాబ్ బచ్చన్, తల్లిగా నీనా గుప్త నటించారు. పవైల్ గులాటి, సునీల్ గ్రోవర్, అశిష్ విద్యార్థి, ఈల్లి అవిరామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. కాగా, రష్మిక బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మిషన్ మజ్ను, అనిమల్ సినిమాల్లో చేస్తున్నారు. ఇక, తమిళంలో దళపతి విజయ్ సరసన వారిసు సినిమాలో నటిస్తున్నారు.