దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంలోని సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం .
తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ టాప్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ప్రతిష్టాత్మక అస్కార్ అవార్డు సొంతం చేసుకొని తెలుగోడి సత్తా ఎంటో నిరూపించింది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ స్టెప్పులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది.
భారత్ లో జీ-20 సదస్సు సోమవారం జమ్మూకశ్మీర్ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.మొత్తం 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జమ్ముకశ్మీర్ లో నిర్వహించిన మొదటి సదస్సు ఇది. శ్రీనగర్ నగరాన్ని సదస్సు ముగిసే వరకు ‘నో డ్రోన్’ జోన్ గా ప్రకటించింది. పలు దేశాలనుండి విచ్చేసిన ప్రతినిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తన అనుభూతిని వ్యక్త పరిచారు. ప్రకృతి అందాలకు ఆలవాలమైన కశ్మీర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా బాగుందన్నారు. ప్రస్తుతం జీ-20 సదస్సు జరుగుతున్న ఆడిటోరియంలో తన సినిమా షూటింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు హీరో రామ్ చరణ్.
కశ్మీర్ అందాలు సినిమా షూటింగ్ లకు అనుకూలంగా ఉంటాయని అన్నారు. తన ముందు తరం నటుడు తండ్రి చిరంజీవి కూడా ఈ కశ్మీర్ ప్రాంతంలో అనేక సినిమాలు షూటింగ్స్ జరిగాయని.. తాను రెండో తరం నటుడినని రాబోయే సినిమాలలో కశ్మీర్ ను మరింత అందంగా చూపించాలనుకుంటున్నా అని అన్నారు. నా తదుపరి సినిమా నిర్మాతలు హాలీవుడ్ నుండి ఉంటే విదేశాల్లో షూటింగ్ జరుగుతుంది. లేదంటే వీలైనంత వరకు మన భారత దేశాన్ని మరింత అందంగా చూపించాలనుకుంటున్నా అని రామ్ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె.బోక్ తో కలిసి ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేసి అందరిని అలరించారు రామ్.