తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో, యాటిట్యూడ్ తో స్టార్ హీరోగా వెలుగొంది, అభిమానులకు ఆరాద్య నటుడిగానే కాకుండా ఆరాద్య దైవంలా మారారు పవన్ కళ్యాణ్. విలక్షణమైన వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
పవన్ కళ్యాణ్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఆయన ఫ్యాన్స్. డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పట్ల తనకున్న ప్రేమను చాటుతున్నాడు. పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేదలకు ఆసరగా నిలిచారు పవన్ కళ్యాణ్. పేదల కష్టాలను తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో రాజకీయ రంగప్రవేశం చేశారు నటుడు పవన్ కళ్యాణ్. జనసేన పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించి పలు రాజకీయ పార్టీలకు సవాల్ విసిరాడు. పేదలు కష్టాల్లో ఉంటే చలించిపోయే పవన్ కళ్యాణ్ ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తారు. కాగా మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రానుండగా ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే పేరుతో ప్రచార రథాన్ని కూడా సిద్దం చేసుకున్నారు. తాజాగా వారాహి విజయ యాత్ర ప్రారంభమైంది.
అంతకు ముందు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో హోమాలు, యాగాలు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ కు చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత అయిన వై రవిశంకర్, డివివి దానయ్య, ఏ ఎం రత్నం, బివిఎన్ ఎస్ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఉన్నారు. వీరంతా యాగంలో పాల్గొని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ పవన్ పాదాలకు నమస్కరించాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
దీని పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. నిర్మాత అయ్యుండి కాళ్లకు నమస్కరించడం ఏంటని కొందరు, పవన్ పై ఉన్న అభిమానాన్ని అలా చూపించాడని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో నిర్మాత రవిశంకర్ పవన్ కాళ్లు మొక్కితే మీకేంటి సమస్య, మిమ్మల్ని మొక్కమనలేదు గదా అని రవిశంకర్ కు అనుకూలంగా స్పందిస్తున్నారు. వెండితెరపై తిరుగు లేని హీరోగా రాణించిన పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో కూడా రాణించి ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని పలువురు కోరుకుంటున్నారు.