ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీ నటులకు అందించే నంది అవార్డులపై నటుడు పోసాని కీలక ప్రకటన చేశారు. ఎంతో ప్రత్యేకత ఉన్న నంది అవార్డులను బాధ్యతను సిఎం జగన్ తనకు అప్పగించారని పోసాని తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ నటీ నటులకు నంది అవార్డులను అందిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి నంది అవార్డుల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు పోసాని కీలకమైన ప్రకటన చేశాడు. నంది అవార్డులకు నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. దీనికి సంబందించిన బాధ్యతలను సిఎం జగన్ తనకు అప్పగించారని పోసాని తెలిపారు. నిజాయితీగా, పక్షపాతధోరణి లేకుండా అవార్డులకు ఎంపిక చేయాలని సిఎం చెప్పినట్లు పోసాని వెల్లడించారు. 1998 నుంచి 2004 వరకు నంది అవార్డులు అందించారని ఆ తరువాత అవి హైదరాబాద్ కే పరిమితమయ్యాయని తెలిపారు. ఇప్పుడు సిఎం జగన్ నంది అవార్డులు ఇవ్వాలని బావిస్తున్నారని తెలిపారు.
గతంలో నంది అవార్డులపై పోసాని మాట్లాడుతూ వివక్షతో, పక్షపాతంతో అవార్డులిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నంది అవార్డులపై పోసాని కీలక ప్రకటన చేశారు. ఉత్తములకు, అర్హులకు నంది అవార్డులు ఇస్తామని వెల్లడించారు. ఎపిలో ఎవరైన ఉచితంగానే షూటింగ్ లు చేసుకోవచ్చు, స్టూడియోలు నిర్మించుకోవచ్చు దానికి కావాల్సిన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని పోసాని తెలిపారు. సినిమా, డ్రామా, టివి రంగాలకు నంది అవార్డులు ఒకేసారి ఇవ్వడం సాధ్యపడదని, ముందుగా నాటక రంగానికి ఇచ్చి, ఆ తరువాత మిగతా రంగాలకు నంది అవార్డులు ఇస్తామని తెలిపారు. ఐ అండ్ పిఆర్ కమిషనర్ మాట్లాడుతూ.. నాటక రంగానికి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుందని తెలిపారు. ఉప సంహరణకు నెల రోజుల గడువు ఉంటుందని తెలిపారు. ఐదు కేటగిరీల్లో పోటీలు ఉంటాయని స్పష్టం చేశారు. పద్య, సాంఘిక నాటకాలు, పిల్లల నాటకాలు, యువ నాటికలు అన్నీ కలుపుకుని మొత్తం 73 అవార్డులు అందజేస్తామని వెల్లడించారు.