కార్తీక మాసం హిందువులుకు ఎంతో ప్రీతి పాత్రమైన నెల. హరిహరులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం. ఈ నెల మొత్తం శివాలయాలు.. భక్తులతో కిటకిటలాడతాయి. ఇక కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి, హనుమాన్ దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు ఈ దీక్షలో ఉండాలి. కానీ కొందరు వారి వీలును బట్టి 11 రోజులు అలా దీక్షలో ఉంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. రామ్ చరణ్, సురేష్ బాబు ఇలా వీరు ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది హీరో నాని కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. శబరిమల ప్రయాణం.. అక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు నాని. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరలవుతోంది. ఆ వివరాఉల..
కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు నాని. అయితే స్వామి దర్శనానికి నాని ఒక్కడే కాకుండా తన కుమారుడ్ని కూడా వెంట బెట్టుకొని వెళ్లాడు. అయ్యప్ప స్వామి ఆలయంలో కొడుకుతో కలిసి బంగారంతో తయారు చేసిన 18 మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించాడు నాని. కొన్ని రోజుల క్రితం నాని అయ్యప్ప మాల వేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా.. ఇరుముడితో శబరిమలకు వెళ్లాడు. అయితే తన వెంట కుమారుడు జున్నుని తీసుకొని వెళ్లిన నాని.. శబరిమల యాత్ర విశేషాల్ని.. అక్కడ ఆయన పొందిన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు
కాలి నడకన కొండపైకి చేరుకున్న నాని.. అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. ఇరుముడితో ఆలయంలోకి వెళ్తున్న వీడియోతో పాటు.. బంగారు మెట్ల దగ్గర తన కుమారుడితో కలిసి పూజ చేస్తున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నాని.. ఈ ఏడాది శబరిమల యాత్ర ఎంతో భక్తిశ్రద్ధలతో సాగిందని.. మళ్లీ వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాలి.. స్వామి శరణం అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.