నందమూరి తారకరత్న.. టాలీవుడ్ హీరోగా 20కి పైగా సినిమాలు చేశారు. హీరో అనే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ గానూ పలు మూవీస్ చేశారు. మరో 6 రోజుల్లో తన చివరి మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఇలా మనల్ని వదిలి వెళ్లిపోయారు.
నందమూరి తారకరత్న.. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక మిగతా విషయాల్లో ఎలా ఉన్నాసరే సినిమాల విషయంలో మాత్రం తారకరత్న కెరీర్ చాలా డిఫరెంట్. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు తన చివరి సినిమా మరో ఆరు రోజుల్లో రిలీజ్ ఉందనగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు తారకరత్న సినీ జర్నీ ఎలా సాగింది అనేది ఈ స్టోరీ.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ మనవడిగా ఆయన నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో తారకరత్న. ఒకేరోజు 9 సినిమాలతో ఇతడి ఎంట్రీ జరిగింది. ఈ జాబితాలో విడుదలైన తొలి చిత్రం ‘ఒకటో నంబర్ కుర్రాడు’. 2002లో రిలీజైన ఈ మూవీలో పాటు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత హీరోగా చెప్పుకోదగ్గ హిట్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా అందుకోలేకపోయారు. కానీ నటుడిగా మాత్రం తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు సహా 22కి పైగా సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. ఇక ‘అమరావతి’ లాంటి సినిమాతో తనలోని విలనిజాన్ని చూపించారు. ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నారు.
బలమైన పాత్రలొచ్చినప్పుడు విలన్ గా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ.. హీరోగానూ పలు సినిమాలు చేశారు. అలా ఈ మధ్య గత కొన్నేళ్ల కాలంలో వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, మహాభక్త శిరియాళ, కాకతీయుడు, దేవినేని, సారథి, ఎవరు తదితర చిత్రాలు చేశారు. ‘9 అవర్స్’ వెబ్ సిరీస్ లో నటించి ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. చివరగా తారకరత్న కీలకపాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘ఎస్5: నో ఎగ్జిట్’ కొన్ని రోజుల ముందే థియేటర్లలో రిలీజైంది. ఇక తారకరత్న హీరోగా నటించిన చివరి సినిమా ‘మిస్టర్ తారక్’. ఓటీటీలో ఇప్పటికే అమెరికా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 24న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఇంతలో ఇలా జరగడంతో అభిమానులు చివరి సినిమా చూసి నివాళి అర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరి తారకరత్న సినిమాల్లో మీకు ఏదంటే ఇష్టం? కింద కామెంట్ చేయండి.