సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రం. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుపుకున్న అఖండ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
‘అఖండ మాస్ జాతర’ పేరుతో రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. నందమూరి బాలకృష్ణ తాను నటించిన అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్లోకాలు, బీజాక్షరాలు, నవ విధాన పూజలను అలవోకగా పఠించారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పవారని, తమ్ముడు అల్లు అర్జున్ ఇంతకుముందే తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకతను వివరించారని వెల్లడించారు.
నటుడు ఏ పాత్ర అయినా చేస్తాడని, నటన అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమేనని, శ్రీకాంత్ అలవోకగా నటించారని కొనియాడారు. కరోనా వల్ల విరామం వచ్చిందని, మళ్లీ ప్రజల ముందుకు వచ్చామని వెల్లడించారు. తన అఖండ చిత్రాన్ని మాత్రమే కాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప, చిరంజీవి నటించిన ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా ఆదరించాలని బాలయ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. నా కెరీర్ లోనే ఇది గుర్తుండిపోయే క్యారక్టర్ అన్నారు.