టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైనప్ చేసి షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్ని సినిమాలున్నా ప్రజా సేవ విషయంలో బాలయ్య ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. తన అభిమానులకు, తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గురించి ఆరా తీస్తుంటాడు.
తాజాగా ఎమ్మెల్యే బాలకష్ణ తన నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ సిద్ధం చేశారు. 200కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, ఆరోగ్య అవగాహన, మాతాశిశు సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ రథం ద్వారా నిర్వహించనున్నారు. ఇక తాజాగా బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో ఎన్టీఆర్ ఆరోగ్యరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ స్థాయిలో హాజరై.. బాలకృష్ణ దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత బాలయ్య ఆరోగ్య రథాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ ఆరోగ్య రథంలో ఓ వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, వైద్యసిబ్బంది, మందుల కౌంటర్ ఉంటుంది. అలాగే ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. అంతకుమించిన వైద్య సేవలకు ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తారని, ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ఈ రథం సేవలు అందించనుందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యరథాన్ని ప్రారంభించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.