సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలీవుడ్ నూ అవి వదలడం లేదు. బాలీవుడ్ ప్రముఖ దర్శకులు సతీష్ కౌశిక్, ప్రదీప్ సర్కార్, నటి మాధురీ దీక్షిత్ తల్లి మరణ వార్తలు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త విషాదాన్నినింపింది.
బాలీవుడ్‌లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న స్టార్ డైరెక్టర్, నటుడు కమ్ నిర్మాత సతీష్ కౌశిక్ గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే. ఆ తర్వాత ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ వృథాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులకే మరో దర్శకుడు ప్రదీప్ సర్కార్ కిడ్నీ సంబంధింత సమస్యలతో ఇటీవల మరణించారు. వీరి మరణాలతో ఇంకా బాలీవుడ్ కోలుకోలేదు. ఇప్పుడు మరో డైరెక్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా తల్లి గురువారం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా తల్లి కమలా ఛబ్రా(73) కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఆమె స్పృహ కోల్పోవడంతో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గురువారం ఆమె తుది శ్వాస విడిచారు. చనిపోయారన్న వార్త తెలియగానే.. బాలీవుడ్ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకున్నారు. దీపికా పదుకొనే, ఫరాఖాన్, అపర్శక్తి ఖురానా, నుపూర్ సనన్, తదితరులు ఆసుపత్రి వద్ద కనిపించారు. తల్లి మరణవార్తను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ముఖేష్ పంచుకున్నారు. శుక్రవారం ముంబైలోని ఓషివారా శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముంబైలోని ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్లలో ముఖేష్ ఛబ్రా ఒకరు. అతను బాలీవుడ్‌లో స్టార్స్ సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్‌లతో సహా పలు చిత్రాలకు ఆర్టిస్టులను సమకూర్చారు. అతను రాజ్‌కుమార్ రావు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, మృణాల్ ఠాకూర్, ప్రతీక్ గాంధీ, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ వంటి ప్రతిభావంతులైన నటులను సినిమా పరిశ్రమకు అందించి పేరు గాంచారు. నటులను పరిచయం చేయడంలో ప్రసిద్ధి చెందారు.