ప్రముఖ తమిళ దర్శకుడు బాలా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలా సినిమాలు చాలా క్లాసిక్ గా, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సినిమాల్లో నటించిన నటులకి జాతీయ అవార్డులు లేదా ఇతర అవార్డులు వస్తాయి. బాలా సినిమాల్లో నటించడం అంటే గొప్పగా భావిస్తుంటారు. బాలా సినిమాలో నటించడమే కాదు, బాలా సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి కూడా నిర్మాతలు ఇష్టపడతారు. అలాంటిది ఒక నిర్మాత ఇప్పుడు బాలా ఆఫీస్ ముందు ధర్నా చేయడం కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. తనతో సినిమా చేస్తానని మాట ఇచ్చి తప్పారని ఒక నిర్మాత బాల ఇంటి ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. సేతు, నంద, పితామగన్, అవన్ ఇవన్, పరదేశీ వంటి సెన్సేషనల్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బాలా పితామగన్ సినిమా సమయంలో నిర్మాత వీఏ దురైకి మాట ఇచ్చారట.
2003లో విక్రమ్, సూర్య హీరోలుగా బాలా దర్శకత్వంలో వచ్చిన చిత్రం పితామగన్. తెలుగులో శివ పుత్రుడు పేరుతో డబ్ అయ్యింది. ఈ చిత్రానికి నిర్మాత వీఏ దురై. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే నిర్మాతకు ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో ఆయనతో మరో సినిమా చేసి పెడతానని అప్పట్లో బాలా మాట ఇచ్చారట. దాని కోసం నిర్మాత రూ. 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాలా ఆ నిర్మాతతో సినిమా చేయలేదు. పైగా తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదని నిర్మాత వీఏ దురై వాపోయారు. బాలాని పలుమార్లు తనతో సినిమా చేసి పెట్టమని అడిగినా బాలా రెస్పాండ్ అవ్వలేదని, కనీసం తాను ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇమ్మన్నా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
దీంతో మంగళవారం చెన్నైలోని బాలా ఆఫీస్ కి వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరారు. అయితే బాలా అనుచరుడు ఆఫీస్ నుండి వీఏ దురైను బయటకు నెట్టేశారట. దీంతో నిర్మాత బాలా కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అయితే నిర్మాతల సంఘం సభ్యులు వీఏ దురైతో మాట్లాడి ధర్నాను ఉపసంహరింపజేశారు. దీంతో నిర్మాత దురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆర్ధిక కష్టాల్లో ఉన్న వీఏ దురై నటుడుగా మారి సినిమాల్లో నటిస్తున్నారు. ఒక సినిమాలో విలన్ గా నటించారు. మరి ఈ వ్యవహారంపై దర్శకుడు బాలా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.