Akanksha Mohan: మోడల్, వర్థమాన నటి ఆకాంక్ష మోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ముంబైలోని ఓ హోటల్ గదిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆకాంక్ష మోహన్ బుధవారం ఒంటి గంట సమయంలో ముంబై, లోఖండ్‌వాలాలోని జమునా నగర్ ఏరియాలో ఉన్న ఓ హోటల్లో గది తీసుకున్నారు. రూములోకి వెళ్లిన వెంటనే తలుపు లోపలినుంచి గడియ వేసుకున్నారు. గంటలు గడుస్తున్నా రూములోంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు.
మేనేజర్ ఆమె గదికి పలుసార్లు ఫోన్ చేశాడు. అయినప్పటికి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మేనేజర్‌కు కూడా అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందగానే పోలీసులు హోటల్ దగ్గరకు చేరుకున్నారు. గది దగ్గరకు వెళ్లి చూడగా.. తలుపు లోపలినుంచి గడియపెట్టి ఉంది. దీంతో తలుపును బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఆకాంక్ష సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించారు. పోలీసులు రూమును మొత్తం వెతగ్గా అక్కడ ఓ సూసైడ్ నోట్ దొరికింది. ‘‘ నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు.
నేను సంతోషంగా లేను. నాకు ప్రశాంతత కావాలి’’ అని ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకాంక్ష మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె తన జీవితంతో సంతోషంగా లేదని, ప్రశాంతత కోరుకుందని వారు తెలిపారు. ప్రమాదం కారణంగా చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆకాంక్ష మోహన్ ఒక వైపు మోడలింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.