మెగాస్టార్ చిరంజీవి, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. వెండి తెరయినా.. సమాజ సేవ అయినా చిరు తర్వాతే ఎవరైనా. అన్నయ్యగా, అందరివాడిగా చిరంజీవి అందిస్తున్న సేవలకు అంతే లేదు. అప్పుడెప్పుడో మొదలైన బ్లడ్ బ్యాంక్ నుంచి కరోనా ఆపత్కకాలంలో ప్రారంభించిన ఆక్సిజన్ బ్యాంక్ వరకు ఆయన సేవలు అనిర్వచనీయం, అనితర సాధ్యం. అలాంటి చిరంజీవుడి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. కరోనా విజృభణతో రెండేళ్లుగా అంతంత మాత్రంగానే జరిగిన వేడుకలు.. ఈ సారి ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయంటున్నారు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సీఓఓ స్వామినాయుడు. మరి, ఆ హైలెట్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి.
చిరంజీవి అన్న పేరు వినపడగానే గుర్తొచ్చేది గ్రేస్‌ఫుల్ స్టెప్పులు. అందుకే ఈసారి పుట్టినరోజు వేడుకల్లో అదే అంశాన్ని హైలెట్ చేస్తూ ఓ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చిరంజీవి సినీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన 47 మంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్లను వేడుకలకు ఆహ్వానించినట్లు స్వామినాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అభిమాని 9 మొక్కలు నాటండి అనే ఒక అద్భుత కార్యమ్రానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రారంభించిన వారంరోజుల్లోనే దాదాపు 3 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. చిరు పుట్టినరోజు వరకు 10 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
కరోనా వచ్చాక తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం దేశంలోనే రక్తం నిల్వలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ జన్మదినం సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ 272 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు స్వామినాయుడు తెలిపారు. అంతే కాకుండా, ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభించినప్పుడు ఎవరైతే ముందుకొచ్చి సేవలందించారో వారందరిని గుర్తించి చిరు జన్మదిన వేడుకల్లో సన్మానించనున్నట్లు స్వామినాయుడు చెప్పారు.