గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ మలయాళీ నటుడు వీపీ ఖలీద్ గుండెపోటుతో కన్నుమూశారు. హీరో టీవీనో థామస్ సినిమా షూటింగ్ సందర్భంగా వైక్కమ్ వెళ్లిన ఖలీద్.. షూటింగ్ లొకేషన్ లో ఉన్న వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించారని తెలుస్తుంది. అది గమనించిన చిత్రయూనిట్ ఖలీద్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇక ఆసుపత్రిలో చెక్ చేసిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయారని నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఖలీద్.. ఎన్నో మలయాళం సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. 1973లో పీజీ ఆంటోని దర్శకత్వంలో వచ్చిన ‘పెరియార్’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ముఖ్యంగా ‘మరిమాయం’లో పోషించిన సుమేష్ పాత్రతో ఖలీద్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుండి అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
ఖలీద్ పలు కామెడీ చిత్రాల్లో నటించి మంచి కమెడియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కామెడీ రోల్స్ చేయడమంటే ఎంతో ఇష్టమని చెబుతుండేవారు. ప్రస్తుతం ఖలీద్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. ఖలీద్ మృతిపట్ల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.