ఇటీవల కాలంలో హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడమనేది కామన్ అయిపోయింది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల సినిమాల వరకూ అందరూ అదే బాటపడుతున్నారు. కనీసం మొదటి పార్ట్ రిలీజ్ కాకముందే సెకండ్ పార్ట్ గురించి ప్రకటించడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మామూలుగా సినిమా హిట్టైన తర్వాత సీక్వెల్ ప్రకటించడం చూశాం. రీసెంట్ గా డీజే టిల్లు, కార్తికేయ 2, బింబిసార ఇలా ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్టు అనిపించుకున్నాకే సీక్వెల్స్ ప్రకటించారు. కానీ.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు రూటే వేరని జిన్నా మూవీ రిలీజ్ కి ముందే ప్రూవ్ చేశాడు.
మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలలో ‘జిన్నా’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ జానర్ లో సూర్య అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కించాడు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ రచనా సహకారంతో.. మూవీని మంచు విష్ణునే నిర్మించడం విశేషం. అయితే.. తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషలలో ప్రమోషన్స్ జరుపుకున్న జిన్నా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విష్ణుపై ట్రోల్స్, సన్నీ లియోన్ గ్లామర్ ద్వారా మోస్తరు అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో జిన్నా సినిమాకు సీక్వెల్ పై సినిమా ఎండింగ్ టైటిల్స్ లో ప్రకటించారు. జిన్నా పార్ట్ 2 లోడింగ్ అంటూ.. క్లైమాక్స్ లో ట్విస్ట్ తో సినిమాను ఎండ్ చేసినట్లు సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసుకున్న ఈ సినిమాలో విష్ణు యాక్టింగ్ తో పాటు డాన్స్, ఫైట్స్ హైలైట్ కాగా.. సన్నీ లియోన్ గ్లామర్, సైకో టైప్ యాక్షన్ పార్ట్స్.. జిన్నా 2కి స్కోప్ క్రియేట్ చేశాయని అంటున్నారు. ఈ లెక్కన జిన్నా మూవీకి సీక్వెల్ తో మంచు విష్ణు కూడా పాన్ ఇండియా డీజే టిల్లు, బింబిసార లైన్ లో చేరబోతున్నాడని టాక్. మరి సీక్వెల్ పై సినిమాలో ప్రకటించినా.. జిన్నా ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ పై కూడా సీక్వెల్ ప్లాన్ ఆధారపడి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. చూడాలి మరి సీక్వెల్ ఏ విధంగా ప్లాన్ చేస్తారో!