నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామునే ఆయనకు గుండెపోటు రావడంతో.. వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కృష్ణ స్పృహ కోల్పోయి ఉండటంతో.. వైద్యులు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి.. ఆయనను తిరిగి స్పృహలోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని.. గడిచే ప్రతి గంటా ప్రధానమే అని.. 48 గంటలు గడిస్తే గానీ.. ఏం చెప్పాలేమని వైద్యులు తెలిపారు. ఇక కృష్ణ మృతిపై ఆయనకు వైద్యం అందించిన వైద్యుడు గురు ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడి.. వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సోమవారం ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే స్పృహ కోల్పోయారు. 20 నిమిషాలు సీపీఆర్ చేశాం. అప్పటికే ఆయన కండీషన్ క్రిటికల్‌గా ఉంది. ఆ తర్వాత 2-3 గంటల్లోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. నాలుగు గంటల తర్వాత డయాలసిస్ చేశాం. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో.. ఇక ఆయనకు ఎలాంటి చికిత్స చేసినా లాభం లేదని అర్థం కావడంతో.. చివరి క్షణాల్లో చికిత్స పేరుతో ఆయనను ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఇక ఏ చికిత్స చేసినా లాభం లేదనుకున్నప్పుడు.. వారిని ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నిస్తాం. కృష్ణ విషయంలో కూడా ఆలానే చేశాం. ఇక కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నాం’’ అని తెలిపారు.
అంతేకాక.. ‘‘కార్డియాక్ అరెస్ట్ అయ్యి.. మల్టీపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడం మాత్రమే కాక.. కృష్ణకు మేజర్ బ్రెయిన్ డ్యామేజీ అయ్యింది. ఇక ఆయన శరీరం చికిత్సకు సహకరించే స్థితిలో లేకపోవడంతో.. ట్రీట్‌మెంట్ ఆపేశాం. చివరి క్షణాల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. మరికొన్ని గంటల్లో కుటుంబ సభ్యులకు కృష్ణ మృతదేహాన్ని అప్పగిస్తాం’’ అని తెలిపారు.