కత్తి మహేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో పేరు తెచ్చుకున్న మహేశ్ కత్తి సమాజంలో ఎంత మంది మిత్రులను సంపాదించుకున్నారో, అంతకన్నా ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నారు. కత్తి మహేశ్ మంచివాడా? చెడ్డవాడా అన్న డిబేట్ పెట్టడానికి ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి అవన్నీ కాస్త పక్కన పెట్టి.., అసలు కత్తి మహేశ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.
కత్తి మహేశ్ అసలు పేరు మహేశ్ కుమార్. తరువాత కాలంలో కత్తి ఆయన పేరులో యాడ్ అయ్యింది. కత్తి మహేశ్ 1977 లో చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కత్తి మహేశ్ కుటుంబం కుల వ్యవస్థ కారణంగా ఊరిలో చాలా సమస్యలని ఎదుర్కొంది. సరిగ్గా.. ఇక్కడే ఆయనకి హిందూ ధర్మ వ్యవస్థ మీద, దేవుళ్ళ పైన నమ్మకం పోయి నాస్తికుడిగా తయారయ్యాడు. ఆ తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు.
చదువు అయిపోయాక ఫిలిం డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కానీ.., అదే సమయంలో పెళ్లి కావడం, ఇద్దరు సంతానం కలగడం, అప్పటికీ దర్శకుడిగా అడుగులు ముందుకి పడకపోవడంతో కత్తి మహేశ్ జీవితంలో రాజీ పడిపోయాడు. డైరెక్టర్ కావాలన్న తన కలని పక్కన పెట్టి, ఫిలిం జర్నలిస్ట్ గా నూతన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెరీర్ తొలినాళ్లలో క్రిటిక్ గా మహేష్ కత్తి సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన సినిమాని విశ్లేషించే తీరు మేకర్స్ కూడా ఇష్టపడతారు.
ఇలా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు ప్రయాణం చేశాక.. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా ఒక లఘు చిత్రం తీశారు. దానికి మంచి పేరు వచ్చింది. ఆ ఊపులోనే.., ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. తరువాత నందు హీరోగా పెసరట్టు అనే మూవీని తెరకెక్కించాడు.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. పెసరట్టు ప్లాప్ తరువాత కత్తి.. ఇక డైరెక్షన్ వైపు ఆసక్తి చూపుకుండా, నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రాసెస్ లోనే హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో నటుడిగా అలరించాడు.
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో కత్తి మహేశ్ భార్య.. పిల్లలతో సహా అతనికి దూరంగా వెళ్ళిపోయింది. కత్తి వ్యవహార శైలి నచ్చక రిలేటివ్స్ కూడా ఆయనతో పెద్దగా సఖ్యత ఉండేవారు కాదు. 2016 నుండి కత్తి చాలా కష్టతరమైన జీవితాన్ని అనుభవించారు.
ఒంటరిగా ఉండలేక స్నేహితుల రూమ్స్ లో తలదాచుకునే విధంగా మానసికంగా కృంగిపోయాడు. అప్పుడు చేతిలో పెద్దగా పని కూడా లేని సమయం. సరిగ్గా.. ఆ సమయంలో జనసేనపై, పవన్ కళ్యాణ్ పై కత్తి మహేశ్ కొన్ని ఫేస్ బుక్ పోస్టింగ్స్ చేశాడు. ఆ పోస్ట్ లు ఆయన జీవితాన్ని మార్చేశాయి.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ సింగల్ నైట్ లో కత్తిని ఫేమస్ చేసేశారు. కత్తి అలా వస్తున్న పేరుని రోజురోజుకి పెంచుకుంటూ పోయాడు. ఇలా మళ్ళీ వర్క్ లో బిజీ అయ్యాడు. కొన్ని సినిమా ఆఫర్స్ దక్కించుకున్నాడు. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు. నాలుగు రూపాయలు డబ్బు సంపాదించుకున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ ని కత్తి మహేశ్ అన్నీ విధాలుగా తిట్టినా.., పవన్ కళ్యాణ్ మాత్రం పరోక్షంగా కత్తి మహేశ్ కి మంచే చేశాడు.
కానీ.., ఇక్కడితో ఆగని కత్తి మహేశ్ మతపరమైన కొన్ని వ్యాఖ్యలు చేసి.., హిందూ సమాజం కోపానికి గురి అయ్యాడు. ఆ సమయంలోనే కత్తి మహేశ్ ని నగర బహిష్కరణ కూడా చేశారు. అయినా.., కత్తి మహేశ్ ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు. దీంతో.., చాలా మందికి కత్తి మహేశ్ శత్రువుగానే మిగిలిపోయాడు. ఇక చనిపోయే నాటికి కత్తి మహేశ్ పూర్తి ఆరోగ్యంగా కూడా లేడు.
కాలేయ సంబందిత వ్యాధితో ఆయన చాలా కాలంగా బాధపడుతూ వస్తున్నారు. ఓవర్ వెయిట్ కూడా ఆయనకి సమస్యగా మారింది. కానీ.., ఇలాంటి సమయంలో కత్తి మహేశ్ యాక్సిడెంట్ అవ్వడం, రెండు వారాల చికిత్స తరువాత కత్తి మహేశ్ తుది శ్వాస విడవడం జరిగింది.
మంచో, చెడో.. ఇది ఒక మనిషి జర్నీ. మా కళ్ళ ముందు బతికి వెళ్లిపోయిన కత్తి మహేశ్ జర్నీ. జీవితంలో ఆయన అనుకున్నది ఏది సాధించలేకపోయాడు. మంచి డైరెక్టర్ కాలేకపోయాడు. మంచి భర్త కాలేకపోయాడు. మంచి తండ్రి కాలేకపోయాడు. అనుకున్న స్థాయిలో డబ్బు సంపాదించలేకపోయాడు.
ఇలాంటి ఫెయిల్యూర్స్ మన అందరి జీవితాల్లో కూడా ఉంటాయి. కానీ.., కత్తి మహేశ్ ఎన్ని విషయాల్లో, ఎన్ని సార్లు విఫలం అయినా, తన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడు కొనసాగిస్తూ వచ్చాడు. చివరి వరకు ఆ ప్రయత్నంలో ఉంటూనే చనిపోయాడు. ఇది కత్తి మహేశ్ లైఫ్ స్టోరీ. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములో తెలియచేయండి.