ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మానియా కొనసాగుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో స్టార్ హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ లు నటించారు. గత నాలుగేళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాకు క్యూలు కడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గురువారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూశారు. మహేష్ బాబు థియేటర్ ఏఎంబి సినిమాస్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలు, నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారు. ఈ ప్రివ్యూకి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఇక సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన జూనియర్… ‘సినిమా సూపర్’ అనే విధంగా థంబ్స్ అప్ చూపించాడు. తారక్ ఎంతో హ్యాపీగా కనిపించాడు. మరి ఆయన రియాక్షన్ చూస్తుంటే… ఇండియన్ సినిమా రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో, అలాగే దేశంలో కొన్ని చోట్ల బెనిఫిట్ షో పడటంతో అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తారక్, చెర్రీ నటన అదిరిపోయిందంటూ, రాజమౌళి టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ నటనతో పాటు అజయ్ దేవగన్ నటన కూడా అదిరింది అంటున్నారు. రాజమౌళి టేకింగ్, స్క్రీన్ ప్లే బాగుందని.. జక్కన్న చెక్కిన మరో కళాఖండం అనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.