దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినిమాల్లోకి వచ్చారు జాన్వీ కపూర్. స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మిలి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో 2019లో వచ్చిన ‘హెలెన్’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘మిలి’ తెరకెక్కింది. ముత్తుకుట్టి క్సేవియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. షూటింగ్ సమయంలో.. ఆ తర్వాత పడ్డ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
జాన్వీ మాట్లాడుతూ.. ‘‘ మిలి సినిమా నా మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపింది. నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేదాన్ని. రాత్రి పడుకున్న తర్వాత కలలు వచ్చేవి. ఆ కలలో కూడా నేను ఫ్రీజర్‌లో ఉన్నట్లు కనిపించేది. నేను అనారోగ్యం పాలయ్యాను. రెండు, మూడు రోజులు డోస్ ఎక్కువున్న నొప్పుల మాత్రలు వేసుకోవాల్సి వచ్చింది. సినిమా డైరెక్టర్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. ఓ 15 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. అది కూడా ఎక్కువ సేపు ఏడూస్తూనే ఉండాలి. కొన్ని సార్లు నా వేలిని ఎలుక కొరుకుతూ ఉండేది.
అదైతే అంత అందమైనది కాదు. ఈ సినిమా కోసం నన్ను 7.5 కిలోల బరువు పెరగాలని డైరెక్టర్ చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే పెరిగాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ అనుకోని పరిస్థితుల కారణంగా ఓ ఫ్రీజర్‌లో బంధీ అయిపోవాల్సి వస్తుంది. ఆమె ఆ ఫ్రీజర్‌నుంచి తప్పించుకుని ప్రాణాలతో ఎలా బయటపడిందన్నది సినిమా కథ. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఫ్రీజర్‌ను నిర్మించారు. అందులో 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేది. అంత చలిలో దాదాపు 20 రోజుల పాటు జాన్వీ షూటింగ్ చేశారు. మరి, మలయాళంలో హిట్‌గా నిలిచిన ‘హెలెన్’ సినిమా హిందీలో ‘మిలి’గా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.