ఇండియన్ సినీ ప్రపంచంలో KGF డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఊహకందని అద్భుతాలను సృష్టించబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్.. ఓ సినిమాటిక్ కేజీఎఫ్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడని ఇటీవలే ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ క్లారిటీ ఇచ్చారు. అదీగాక ప్రశాంత్ చేతిలో ప్రస్తుతం సలార్, NTR31 సినిమాలున్నాయి. కేజీఎఫ్ సిరీస్.. సలార్.. NTR31 ఈ మూడు సినిమాలలో కామన్ పాయింట్ డార్క్ రస్టిక్ యాక్షన్. రాకింగ్ స్టార్ యష్ ద్వారా ‘KGF’ ప్రపంచాన్ని పరిచయం చేశాడు ప్రశాంత్.. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ తో ‘సలార్’ ప్రపంచాన్ని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ మరో బిగ్ ప్రాజెక్ట్ చూపించనున్నాడు. అయితే.. మూడు సినిమాలలో కామన్ గా కనిపిస్తుంది ఓ డార్క్ మాఫియా థీమ్.
హీరోల లుక్స్ కూడా కేజీఎఫ్ తరహాలోనే కనిపించేసరికి.. ప్రశాంత్ నీల్ నిజంగానే ప్రభాస్, ఎన్టీఆర్ లను సూపర్ హీరోలుగా కేజీఎఫ్ యూనివర్స్ లో కలపబోతున్నాడా అంటే.. రిలీజైన సలార్, NTR31 పోస్టర్స్ అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మార్వెల్ యూనివర్స్ ని అద్భుత శక్తులున్న సూపర్ హీరోలతో సృష్టిస్తే.. ప్రశాంత్ నీల్ దక్షిణాది యాక్షన్ హీరోలతో కేజీఎఫ్ యూనివర్స్ చుట్టూ నడిచే ఓ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించాడు. ఆ కల ఏంటనేది గోప్యంగా ఉంచినప్పటికీ, సౌత్ హీరోలతో సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయటమే కావచ్చని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ప్రధానం కాబోతుంది. కేజీఎఫ్ 2లో రాకీ షిప్పుల్లో బంగారంతో సముద్రంలో మునిగిపోతాడు. ఆ తర్వాత సీఐఏ రంగంలోకి దిగి రాకీని ‘ఇంటర్నేషనల్ క్రిమినల్’ అని ప్రకటిస్తుంది.
కేజీఎఫ్ 3.. రాకీ చనిపోవటానికి ముందు జరిగిన సంఘటనలతో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సీక్వెల్స్.. టైమ్ లైన్ సినిమాలుగా రాబోతున్నవే సలార్, NTR31 సినిమాలు అనేది ప్రస్తుతం ఆసక్తిరేపుతున్న విషయం. ఎందుకంటే సముద్రంలో మునిగిపోయిన రాకీ నిజంగా చనిపోయాడన్న క్లారిటీ లేదు. అలాగే KGF-3 ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి.. రాకీ ఇంకా కొనసాగుతాడని అర్థమవుతుంది. మరి సలార్, ఎన్టీఆర్ సినిమాలలో రాకీ పుట్టుకొస్తాడా? లేదా ప్రభాస్.. ఎన్టీఆర్ భాగాలనే యష్ తో కలపబోతున్నారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
నిర్మాత విజయ్ చెప్పినదాని ప్రకారం.. కేజీఎఫ్ సిరీస్ ని ‘మార్వెల్ యూనివర్స్’గా ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.. అలాగే కేజీఎఫ్-3 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని.. ముందుముందు భాగాలలో వేరే స్టార్ హీరోలు కూడా నటించే అవకాశం ఉందని తెలిపారు. మరి ఇప్పుడు ‘కెజిఎఫ్-3’లో మలుపులు, కొత్త పాత్రలు పుట్టుకొస్తాయో చూడాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. సలార్, ఎన్టీఆర్31 సినిమాలు కూడా గనుల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాలను కేజీఎఫ్‌తో కలిపే పాయింట్లు చాలానే ఉన్నాయి. సలార్ సినిమాను, కేజీఎఫ్ సినిమాను ఇంటర్ లింక్ చేస్తే.. ఒకవేళ రాకీ బతికి వస్తే ప్రభాస్, యశ్ లతో ఓ కొత్త ప్రపంచం సృష్టించే అవకాశం లేకపోలేదు.
ముగ్గురు మాస్ యాక్షన్ హీరోలను ఒకచోట చేర్చి.. ప్రేక్షకులకు యాక్షన్ ఫీస్టు ఇవ్వొచ్చు. టైమ్ లైన్ ను బేస్ చేసుకుని సలార్, ఎన్టీఆర్ సినిమాలను కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ కలిపేస్తారేమో.. ఇక్కడ సినిమా పేర్లు మారుతుంటాయి. కానీ, టైమ్ లైన్ మాత్రం ఒక్కటే. ఒక సినిమాలో హీరో అయిన వ్యక్తి.. మరో సినిమాలో మరికొందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. తాజాగా, ప్రశాంత్ నీల్ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ని కలిశారు. ఆయనతో సినిమా ఉంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. సౌత్ లోని స్టార్ హీరోలందర్నీ కలిపి కేజీఎఫ్ యాక్షన్ యూనివర్స్ లోకి తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి, హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లాగా ప్రశాంత్ నీల్ సౌత్ హీరోలతో కేజీఎఫ్ వరల్డ్ చుట్టూ ఓ యాక్షన్ స్టోరీని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.