నాన్న అంటే ఓ భరోసా.. నమ్మకం. ఏ సమస్య వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. మన వేలు పట్టి నడక నేర్పించి.. జీవితంలో ముందడుగు వేయించే తోడు నాన్న. మనకు ఎంత వయసు వచ్చినా సరే.. నాన్నకు మాత్రం పిల్లలమే. మరి అలాంటి నాన్నకు ఏమైనా అయితే.. అలా కదలకుండా ఉండిపోతే.. నాన్నను ఆ స్థితిలో చూడాలంటే ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. మనల్ని నడిపించే నాన్నను అలాంటి పరిస్థితుల్లో చూడటం.. ఆ నాన్నకు మనమే సేవలు చయాల్సి రావడం ఎంత విషాదమో కదా. అయితే చాలా కొద్ది మంది మాత్రమే.. ఇలాంటి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొవడమే కాక.. తండ్రికి సేవ చేయడానికి దొరికిన అదృష్టంగా భావిస్తారు. తండ్రికి అన్ని తామై.. నాన్నను కొడుకులా చూసుకునే పిల్లలు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకరు గుప్పెడంత మనసు ఫేమ్ రిషి అలియాస్ ముఖేష్ గౌడ.
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు రిషి అలియాస్ ముఖేష్ గౌడ. సీరియల్లో తల్లి ప్రేమకు దూరమైన వ్యక్తిగా అతడు పలికే సంభాషణలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాయి. ముక్కు మీద కోపం.. ఇగో మాస్టార్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు రిషి. అలాగే తండ్రి మహేంద్రతో కలిసి చేసే సీన్స్ చూస్తే.. అసలు వీళ్లు నటిస్తున్నారా.. జీవిస్తున్నారా.. రియల్‌గా తండ్రి కొడుకులు అనేట్టుగా ఉంటాయి ఆ సన్నివేశాలు. సీరియల్లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చూస్తే.. ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఉండాలి అనిపించక మానదు.
అయితే రీల్ లైఫ్‌లో తండ్రి మీద ఎంత ప్రేమ, బాధ్యతగా ఉంటాడో.. వాస్తవ జీవితంలోనూ అలానే ఉంటాడు రిషి. రిషి తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. నాన్నకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఆ కుటుంబం, ముఖ్యంగా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యుల ఇళ్లలో అయితే వారే తండ్రికి సేవ చేస్తారు. అదే సెలబ్రిటీలు అయితే.. మనుషులను పెట్టి చూసుకుంటారు. కానీ రిషి మాత్రం అందుకు భిన్నం. సీరియల్స్‌లో చేస్తూ.. తాను ఎంత బిజీగా ఉన్నా సరే.. తండ్రికి అన్ని తానై.. కొడుకులా సేవలు చేస్తున్నాడు.
ఈ విషయాన్ని తాజాగా స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేదికపై వెల్లడించాడు. ఈ సందర్భంగా తన తండ్రిని పరిచయం చేశాడు రిషి. వచ్చే ఆదివారం స్టార్ మా ఛానల్లో ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. దీని ద్వారా రిషి జీవితంలో ఉన్న విషాదాన్ని ప్రపంచానికి వెల్లడించారు. అంతేకాక తండ్రికి అన్ని తానై.. కొడుకులా చూసుకుంటున్న రిషి గురించి అందరికి తెలియజేశారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని చెప్పి అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు రిషి.
ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ.. ‘‘మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నా జీవితంలో జరిగింది. నాన్నకు నేనే నాన్నను కావడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అంటూ రిషి తండ్రిని చూసి చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఇక రిషి తన తండ్రికి అన్నం తినిపిస్తూ.. గెడ్డం గీస్తూ.. ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించాడు. కదల్లేని స్థితిలో ఉన్న తండ్రిని.. కన్న కొడుకులా చూసుకుంటూ తండ్రిగా మారాడు రిషి. నటుడిగా రిషి ఎంత ఎత్తుకి ఎదుగుతారో తెలియదు కానీ.. ఒక కొడుకుగా మాత్రం జీవితంలో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు అంటూ రిషిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు.
ఇక ముఖేష్ గౌడ మోడలింగ్‌తో కెరియర్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెల్చుకున్నాడు. ఆ తరువాత కన్నడ టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రిషి నటించిన తొలి సీరియల్ ‘నాగకన్నిక’. ఈ సీరియల్‌తో డెబ్యూ హీరోగా ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు రిషి. ఆ తర్వాత ‘ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టాడు ముఖేష్. ప్రస్తుతం ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో రిషి పాత్ర ద్వారా.. తెలుగు ప్రేక్షకుల్ని.. తన అద్భత నటనతో ఆకట్టుకుంటున్నాడు ముఖేష్ అలియాస్ రిషి.