Ganta Srinivasa Rao: మెగాస్టార్ చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లిన గంటా ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ‘గాడ్ ఫాదర్’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించటంతో చిరును అభినందించటానికే గంటా వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, చిరు-గంటా భేటీలో తాజా ఏపీ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కాగా, మంగళవారం గాడ్ ఫాదర్ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతుపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘వచ్చే ఎన్నికల్లో మీరు జనసేన పార్టీకి మద్దతిస్తారా?’’ అన్న విలేకరి ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. జనసేన పార్టీకి తన మద్దతు ఉంటుందో లేదో అది భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ నిబద్ధత, నిజాయతీ గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు కచ్చితంగా కావాలని స్పష్టం చేశారు. తన ఆకాంక్ష కూడా అదేనన్నారు. దానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. తాము రాజకీయాల్లో చెరోవైపు ఉండటం కంటే కూడా.. తాను తప్పుకోవడమే పవన్‌కు మేలు అవుతుందేమోనని..
భవిష్యత్తులో తాను ఏ పక్షాన ఉంటాననేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. పవన్ రాష్ట్రాన్ని ఏలే రోజు రావాలని.. ప్రజలు పవన్‌కు ఆ అవకాశం ఇవ్వాలని కోరారు. పవన్ కల్యాణ్‌కు భవిష్యత్తులో మద్దతిస్తానేమోనని అన్నారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా అక్టోబర్ 5.. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలమాళం సినిమా ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చిరంజీవి మాస్ నటనకు జనం జేజేలు కొట్టారు. ఇక, ఈ సినిమా మంచి కలెక్షన్లతో అన్ని సెంటర్లలో దూసుకుపోతోంది.