మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ నడుపుతున్న ఎమ్మెల్యే గణేశ్ మరో బైక్ ను అనుకోకుండా ఢీ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా బైక్ పై నుంచి ఎమ్మెల్యే కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రగాయమైంది. దీంతో వెంటనే ఆయనను నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అనంతరం విశాఖ పట్నంలోని మరొక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కాలికి శస్త్ర చికిత్స చేయడం అవసరమని అక్కడి వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.