ఈ మధ్య ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే చాలు.. వెంటనే దానికి సీక్వెల్ కావాలంటూ ప్రేక్షకుల డిమాండ్స్ రావడం జరుగుతుంటుంది. అవును.. నిజమే కదా! సీక్వెల్ చేసేద్దాం అని దర్శకనిర్మాతలు త్వరపడి ప్రకటించడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ భాషలో తెరకెక్కిన సినిమాను రీమేక్ చేయడం ఎంత కష్టమో, ముందుగా ప్లాన్ చేయని సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకోవడం కూడా అంతే కష్టం. కానీ.. మేకర్స్ మైండ్ లో ఆ ఆలోచన లేకపోయినా ఫ్యాన్స్, ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊదరగొట్టేస్తుంటాయి. ఇటీవల బ్లాక్ బస్టర్ సీతారామం సినిమాపై కూడా సీక్వెల్ రూమర్స్ చాలా వచ్చాయి.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం‘ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. క్లాసిక్ లవ్ స్టోరీ అనిపించుకున్న ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ గా దుల్కర్, మహారాణి సీతామహాలక్ష్మీలా మృణాల్ తమ పాత్రలలో ఒదిగిపోయారు. అయితే.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఇదే విషయాన్నీ తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ని అడిగాడు ఓ రిపోర్టర్. ఇక సీతారామం సీక్వెల్ పై స్పందించిన దుల్కర్.. “ఓ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచినప్పుడు దాన్ని సీక్వెల్ పేరుతో మళ్లీ టచ్ చేయొద్దని నేను నటుడిని కాకముందే నిర్ణయించుకున్నాను.
మేము సీతారామం కథను బాగా నమ్మి, క్లాసికల్ హిట్ గా నిలుస్తుందని ముందే భావించాం. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులు మా సినిమాను తమ గుండెల్లో నిలుపుకున్నారు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని అనుకుంటున్నా. అలాగే రీమేక్ విషయంలో కూడా అంతే” అంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. వైజయంతి బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ ని రాబట్టింది. అలాగే దక్షిణాది ప్రేక్షకులతో పాటు హిందీలో కూడా సీతారామం విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి సీతారామం సీక్వెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.