చిత్ర పరిశ్రమలో ఎవరి టాలెంట్ ఎప్పుడు గుర్తించబడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. నటులుగా కెరీర్ ప్రారంభించి, తర్వాత డైరెక్టర్స్ గా మారిన వారున్నారు. డైరెక్షన్ నుండి యాక్టింగ్ వైపు అడుగులేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరూ ఎలా సర్ప్రైజ్ చేస్తారో చెప్పలేం. కొన్నిసార్లు ఊహించని వారే మంచి పొజిషన్ లోకి చేరుకుంటారు. మరికొన్నిసార్లు స్టార్స్ అవుతారని అనుకున్నవారే వెనకబడి పోతుంటారు. కానీ.. ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. అన్నట్లుగానే టాలీవుడ్ లో ఓ కమెడియన్ త్వరలోనే డైరెక్టర్ గా డెబ్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు.. కమెడియన్ వేణు(టిల్లు).
డైరెక్టర్ తేజ సినిమాలతో వెలుగులోకి వచ్చిన వేణు.. తెలుగులో చాలా సినిమాలే చేశాడు. ముఖ్యంగా మున్నా సినిమాలో ప్రభాస్ కి పోటీగా హీరోయిన్ ని ప్రేమించే పాత్రలో వేణు మంచి గుర్తింపు పొందాడు. అయితే.. కమెడియన్ గా సినిమాలైతే చేశాడు గానీ, వేణుకి రావాల్సినంత పేరు, స్టార్డమ్ మాత్రం లభించలేదు. దీంతో కొన్నేళ్లుగా అడపాదడపా సినిమాలు, టీవీ షోలు చేస్తూనే.. సొంతంగా ఓ స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం చేసి సినిమా ప్లాన్ చేశాడట. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఆ సినిమాకు వేణునే దర్శకుడు కాగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. అంటే.. కమెడియన్ వేణు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ దిల్ రాజు ప్రొడక్షన్ లో డైరెక్టర్ గా డెబ్యూ చేస్తుండటం విశేషం.
వేణు రాసుకున్న కథ నచ్చడంతో ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు కూడా అతనికే అప్పగించాడట దిల్ రాజు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న వేణు సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక తెలంగాణ ఆత్మహత్యల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని.. దిల్ రాజు ఎక్కడా కంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మించినట్లు సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఇక త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్, ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారట దిల్ రాజు, వేణు. మరి కమెడియన్ వేణు డైరెక్టర్ వేణుగా సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.