ఇండియన్ సినీ చరిత్రలో అతిలోకసుందరి అనగానే దివంగత అందాలనటి శ్రీదేవి పేరే చెప్పుకుంటారు. తన అందంతో శ్రీదేవి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చీరకట్టులో అయినా, మోడరన్ డ్రెస్సులోనైనా శ్రీదేవి ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలా శ్రీదేవి తెరపై ఏ రూపంలో కనిపించినా ఆరాధించే అభిమానుల సంఖ్య పెరుగుతూ వచ్చిందే గానీ, ఎప్పుడూ శ్రీదేవి కట్టుబొట్టుపై నెగటివ్ కామెంట్స్ వినిపించలేదు. అంటే.. గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న శ్రీదేవి.. ఆమె ఫాలో అయిన డ్రెస్సింగ్ స్టైల్ కే వన్నె తెచ్చిందని భావిస్తుంటారు అభిమానులు, ప్రేక్షకులు.
ఇక తెలుగుతో తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలలో నటించిన శ్రీదేవి.. దాదాపు ఆయా భాషల్లోని అందరు స్టార్స్ సరసన సినిమాలు చేసింది. ఈ క్రమంలో శ్రీదేవి చీరకట్టులో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి చీరలో కూడా దేవకన్యను తలపించే అందం ఆమెది. అయితే.. 54 ఏళ్లకే శ్రీదేవి కన్నుమూయడం అనేది ఫ్యాన్స్ ని ఎంతో బాధించింది. ఇదిలా ఉండగా.. అప్పుడప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అభిమాన సెలబ్రిటీలు వాడిన వస్తువులను లేదా డ్రెస్సులు, చీరలను వేలంపాట వేస్తుంటారు సినీ దర్శకనిర్మాతలు. గతంలో శ్రీదేవి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఇష్టమైన ‘కోటా’ చీరను వేలం వేయగా అది రూ. 1.40 లక్షల ధర పలికినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు మరోసారి శ్రీదేవి కట్టిన చీరలను వేలం వేయనున్నట్లు సమాచారం. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ మూవీ 2012లో అక్టోబర్ 10న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో శ్రీదేవి నటనతో పాటు ఆమె చీరకట్టుకు, చీరలకు మంచి పేరొచ్చింది. దీంతో ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ విడుదలై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా.. మూవీలో శ్రీదేవి కట్టిన చీరలను వేలం వేయనున్నట్లు దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఆ వేలంతో వచ్చే డబ్బును బాలికల విద్యకోసం పనిచేసే స్వచ్చంధ సంస్థకు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే.. 1997లో నటన ఆపేసిన శ్రీదేవి.. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతోనే రీస్టార్ట్ చేయడం విశేషం.