దసరా పండుగ నేపథ్యంలో బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అంశం సోషల్ మీడియాలో ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులతో చిరంజీవి సెల్ఫీలు దిగుతుండగా.. దానిపై గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కార్యక్రమం ఆపకపోతే తాను అక్కడ నుంచి వెళ్లిపోతానని అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుమారు వారం రోజుల పాటు ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ సాగింది. తాజాగా ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సారి చిరంజీవి పరోక్షంగా గరికపాటి మీద సెటైర్లు వేయడంతో.. మరోసారి ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు రచించిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కొందరు మహిళలు చిరంజీవితో ఫోటోలు దిగడానికి స్టేజీ ఎక్కి ఆయన దగ్గరకు వెళ్లారు. వారందరూ వరుసగా నిల్చుని ఫోటోలు దిగడానికి సిద్ధం అవుతుండగా.. చిరంజీవి పరోక్షంగా గరికపాటి అంశం మీద సెటర్లు వేసి.. అక్కడ నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా చిరంజీవి.. ‘ఇక్కడ వారు లేరు కదా’ అంటూ వేలు పైకి చూపిస్తూ గరికపాటి నరసింహారావును పరోక్షంగా గుర్తుచేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నాటి వివాదాన్ని గుర్తు చేసుకుని నవ్వారు.
“ఇక్కడ వారు లేరు కదా!?” @KChiruTweets క్యా టైమింగ్ హై సర్ జీ!! 😂😂😂 pic.twitter.com/yTyrgcVyhR
— harish (@27stories_) October 28, 2022
కాగా, పుస్తకావిష్కరణ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… ‘‘‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ లాంటి పుస్తకాలు భావితరాలకు ఎంతో అవసరం. ఇప్పుడున్న వారికి.. ముందు తరాల సిని దిగ్గజాల గురించి తెలియడం లేదు.. దానికి నా ఇళ్లే ఉదాహరణ. నా మనవళ్లు, మనవరాళ్లు.. ఎంతసేపటికి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, తేజు, వైష్ణవ్‌లనే హీరోలుగా ఫీలవుతూ, వాళ్ల సినిమాలు, పాటలే చూస్తుంటారు. అది చూసి నా కడుపు మండిపోతుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
‘‘అందుకే నా గురించి నేనే వాళ్ల దగ్గర డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది నా సినిమాల్లోని ఎవర్ గ్రీన్ పాటలను వారికి చూపించాల్సి వచ్చింది. ఈ తర్వాత నా మనవళ్లు, మనవరాళ్లు నా గురించి తెలుసుకుని గాడ్ ఫాదర్ సినిమా నాలుగు సార్లు చూశారు. నన్ను నేను నిరూపించుకోవడానికి చిన్న పిల్లల దగ్గర సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏళ్లు గడిచేసరికి.. మన ముందు ఉన్న దిగ్గజాల గురించి మరిచిపోతున్నారు. అలాంటి వాళ్ల గురించి చెప్పడానికి ప్రభు పూనుకోవడం అభినందనీయం’’ అంటూ చిరంజీవి ప్రశంసించారు.