మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’తో ఇండస్ట్రీకి ‘గాడ్ ఫాదర్’ అని, తనకు అస్సలు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశారు. సరైన సినిమా పడాలేగానీ అది రీమేక్ అయినా సరే బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారంటీ అని నిరూపించారు. గత కొన్నాళ్లలో ఇండస్ట్రీ మంచి కోసం చిరంజీవి ఎంతో కష్టపడుతున్నారు. దీంతో ఆయన గురించి, పొలిటికల్ కెరీర్ గురించి రకరకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరెన్ని మాటలు అంటున్నా సరే ఆయన సైలెంట్ గా ఉంటూ వచ్చారే తప్ప ఒక్క విషయంలోనూ కోపం, ఆవేశానికి గురికాలేదు. ఇక ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ చిరు గురించి ఎవ్వరికీ తెలియని రహస్యం బయటపెట్టారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి గతంలో ‘ప్రజారాజ్యం’ అనే పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. పోటీ చేస్తుంది తొలిసారే అయినా సరే ఏకంగా 18 శాతం ఓటింగ్ తో 18 స్థానాలు గెలుచుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక 2011లో కాంగ్రెస్ లో తన పార్టీని కలిపేశారు. దీంతో అప్పట్లోనే చిరు గురించి నానా రకాలుగా మాట్లాడారు. ఎవరు ఎన్ని మాటలు అన్నాసరే చిరు ఓర్పుగా భరించారే తప్ప.. ఏనాడు కూడా ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇక ఆ విషయం గురించి ప్రజలు, అభిమానులు దాదాపు మర్చిపోయారు. ఈ విషయం అప్రస్తుతం అయినప్పటికీ.. అప్పటి పరిస్థితులు చిరు చేసిన త్యాగాల గురించి ‘గాడ్ ఫాదర్’ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ బయటపెట్టారు.
‘తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ సభ నిర్వహించాం. కానీ చిరంజీవికి నేను చెప్పింది కాకుండా తాను అనుకున్నది అక్కడున్న 30 మందికి చెప్పి పంపేశాడు. అది చూసి నేను ఆశ్యర్యపోయాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి చాలా సఫర్ అయ్యారు. అందులో మేం కూడా భాగమే. తిరుపతి ఎన్నికలు ఎలా చేశామనేది ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అందరిముందు ఆయనకు కూడా తెలియని నిజమిది. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అయితే మద్రాసు ప్రసాద్ ల్యాబ్ పక్కనుండే కృష్ణానగర్ గార్డెన్ ప్రాపర్టీ అమ్మి, ప్రజారాజ్యం పార్టీ అమ్మేముందు అప్పులన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి చిరంజీవి. అలాంటి వ్యక్తిని పట్టుకుని అమ్ముడుపోయారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన కష్టంతో ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ ఉంది. అలాంటి వ్యక్తి గురించి ఎవరుపడితే వారు మాట్లాడటం, ఏదంటే అది రాస్తున్నారు. ఇంకో విషయం.. పవన్ కల్యాణ్ ని మీరు ఏమైనా అనండి భరిస్తాడు. కానీ చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ ఊరుకోరు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదన ఈ రోజు జనసేన’ అని ఎన్వీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరి గురించి మాట్లాడే ముందు, రాసే ముందు గానీ ఒక సెకన్ ఆలోచించండి అని ఆయన అన్నారు. మరి చిరు ప్రజారాజ్యం గురించి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.