సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు మాత్రమే కాక.. టాలీవుడ్‌కి కూడా పెద్ద పండుగే. పెద్ద పెద్ద స్టార్ హీరోలంతా.. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుంటారు. ఈ సారి సంక్రాంతికి కూడా పెద్ద హీరోలు సినిమాలు విడుదల అవుతున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాలు.. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్.. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. విశాఖలో ఆదివారం రెండు సముద్రాలు కనిపించాయి జనాలకు. మెగా అభిమానులు విశాఖకు పోటేత్తారు. ఈ ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా చిరంజీవి.. ‘‘విశాఖ అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా నాకేంతో ఇష్టం. వైజాగ్ వాసులు శాంతికాముకులు. కుళ్లుకుతంత్రాలకు తావులేని మంచి మనుషులు వారు. సరదాగా ఉంటారు.. ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. ఈ ప్రాంతం, ఇక్కడి వాళ్ల గొప్పతనం గురించి నేను ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. బాధ్యతల నుంచి బయటపడిన తర్వాత.. ఇక్కడొక స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా జీవించాలనుకునేవారికి స్వర్గధామం ఈ వాల్తేర్.. వైజాగ్. ఇన్నాళ్లు ఇక్కడ సెటిల్ కావాలని చెబుతుండేవాడిని. కానీ ఇప్పుడు భీమిలి వెళ్లే దారిలో ఓ స్థలం కొన్నాను. ఇక ఇళ్లు కట్టే ప్రయత్నం చేయాలి. ఆ పని చేస్తే నేను కూడా విశాఖ వాసుడ్ని అవుతాను. అది నా చిరకాల కోరిక’’ అని చెప్పుకొచ్చాడు చిరంజీవి.
‘‘ఇక బాబీ.. నాకు ఈ వాల్తేరు వీరయ్య అనే కథ చెప్పాలని వచ్చాడు.. వాల్తేరు అని పేరు వినగానే ఫాజిటివ్ ఫీలింగ్ కలిగింది. కథ చెప్పమన్నా. తొలి సిట్టింగులో తను గంటన్నర సమయం తీసుకున్నాడు. అద్భుతంగా అనిపించి షేక్ హ్యాండ్ ఇచ్చాను. సినిమా చేస్తున్నామని చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్‌లో నాకు నచ్చిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. అదే నమ్మకంతో ఇప్పుడు చెబుతున్నాను. తప్పకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది’’ అని తెలిపాడు చిరంజీవి. విశాఖపై చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. మరి చిరు నిజంగానే విశాఖలో సెటిల్ అవుతారని భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.