కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆణిముత్యాల వంటి సినిమాలు తెరకెక్కించారు విశ్వనాథ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవ చేసిన విశ్వనాథ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి, వెంకటేష్, వెంకయ్య నాయుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, నాగబాబు వంటి ప్రముఖులు విశ్వనాథ్ నివాసానికి చేరుకుని.. ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా విశ్వనాథ్‌ను కడసారి చూసి.. నివాళులర్పించడానికి వచ్చారు. లేవలేని స్థితిలో ఉన్నప్పటికి కూడా చంద్రమోహన్.. విశ్వనాథ్‌ను చూడటం కోసం వచ్చారు.
సిరిసిరిమువ్వ వంటి చిత్రంతో తన కెరీర్‌ను మలుపు తిప్పిన దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్‌ను.. అలా నిర్జీవంగా చూసి చంద్రమోహన్ చలించిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయనను ఓదర్చాడం ఎవరి తరం కాలేదు. చిరంజీవి కూడా విశ్వనాథ్‌ను చూసి ఎమోషనల్ అయ్యారు. విశ్వనాథ్‌తో తనది తండ్రి-కొడుకుల బంధం అని చిరంజీవి చెప్పుకొచ్చారు. విశ్వనాథ్ ఇక లేరని తెలిసి సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు. చిత్ర పరిశ్రమంతో విశ్వనాథ్ అనుబంధం అలాంటిది.
హీరోయిజం, ఫైట్లు, చిల్లర గెంతులు వంటివి లేకుండా.. కేవలం కథనే హీరోగా మలిచి.. సినిమాను తెరకెక్కించి.. విజయం సాధించడం విశ్వనాథ్ ఒక్కరికే సొంతం అవుతుంది. ఆయన సినిమాల్లో హీరో అంటే ఆరడుగుల అందగాడు.. శారీరక, మానసిక వైకల్యం లేని వ్యక్తిగా ఊహించుకుంటే పొరపాటే. మన చుట్టూ సమాజంలో.. మన పక్కనే ఉండే సామాన్య వ్యక్తుల మాదిరే ఉంటారు విశ్వనాథ్ సినిమాలో హీరోలు. ఇందుకు నిదర్శనం సిరివెన్నెల, సిరిసిరిమువ్వ వంటి సినిమాలు.
సిరిసిరిమువ్వ సినిమాలో చంద్రమోహన్ డప్పు కొట్టుకుని జీవించే కళాకారుడి పాత్రలో నటించిగా.. జయప్రద మూగ అమ్మాయి పాత్రలో జీవించింది. ఈ సినిమా చంద్రమోహన్ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ నటనను ఎవరు మర్చిపోలేరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్.. ‘‘నా కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా సరే.. విశ్వనాథ్ చిత్రంలో నటించినప్పుడు ఎంతో సంతృప్తి కలిగింది’’ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన విశ్వనాథ్ పార్థీవదేహం చూసి చంద్రమోహన్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.