బిగ్ బాస్ రియాలిటీ షో విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి.. అయ్యి నెమ్మదిగా అన్ని భాషల్లో పాతుకుపోతుంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కూడా ముగిసింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే.. జీవితం సెటిల్ అయింది అనుకుంటారు. చాలా మంది బిగ్‌బాస్ గేమ్‌లో పాల్గొనాలని భావిస్తారు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి.. అందునా ఇద్దరికి మాత్రమే ఆ అవకాశం లభించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. హౌజ్‌లోకి సామాన్యులకు స్వాగతం అంటున్నాడు హోస్ట్ నాగార్జున. ఆ వివరాలు..
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముంగిసింది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్-6కు సన్నహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ఊహించని ఆఫర్ ప్రకటించారు. ఈ సారి ‘స్టార్ మా’, ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్-6లో సామ్యానులకు కూడా అవకాశం ఇస్తున్నామని నాగార్జున వెల్లడించారు. ఇది కేవలం ‘వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం ఓ ప్రమోను విడుదల చేశారు. ‘‘ఇన్నాళ్లూ మీరు ఇంట్లో కూర్చొని ‘బిగ్ బాస్’ హౌస్‌ను చూశారు. అయితే, స్టార్ మా మీకు ఆకాశాన్ని అందుకొనే అవకాశాన్ని ఇస్తుంది’’ అని నాగార్జున వెల్లడించారు. ఇందులో పాల్గొనేందుకు మీరు ఏం చేయాలనే విషయాన్ని వీడియోలో వెల్లడించారు.
అయితే ‘బిగ్ బాస్’ లోకి వెళ్లేందుకు సామాన్యులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఇద్దరు సామాన్యులకు అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. నూతన్ నాయుడు, గణేష్‌లు సామాన్యులుగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గణేష్ సుమారు 83 రోజులు హౌస్‌లో సెలబ్రిటీలతో కలిసి ఉండగలిగాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఆ షోకు హీరో నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన మిగతా మూడు సీజన్లలో సామాన్యులకు అవకాశం చిక్కలేదు. వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పిన నాగార్జున.. మరిన్ని వివరాల కోసం Starmaa.startv.com ఓపెన్ చేయాల్సిందిగా సూచించారు.
ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత.. మీ పేరు, వివరాలు, మీకు సంబంధించిన ఆసక్తికర అంశాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానితోపాటు మీకున్న టాలెంట్ కు సంబంధించిన ఓ 3 నిమిషాల షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వీడియో 3 నిమిషాలకు మించి ఉండకూడదు. అలా టైమ్ లిమిట్ దాటితే రిజెక్ట్ చేస్తారు. అదీ సంగతి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వెబ్ సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. బిగ్ బాస్ కల్పించిన ఈ అవకాశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.