ప్రియుడే కాల యముడు అవుతాడని నవ్య అస్సలు ఊహించలేదు. ఎంతో ప్రేమతో తన పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నాడని అనుకుంటూ ఉంది. కేకు కట్ చేసిన తర్వాత ఓ ముక్క ఆమెకు తినిపించాడు. ఆ వెంటనే...
అనుమానం పెను భూతం అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రేమ, పెళ్లి బంధాల్లో అనుమానం దారుణాలకు తెర తీస్తోంది. ముఖ్యంగా ఆడవాళ్లపై అనుమాన పడుతున్న మగాళ్లు హత్యలు చేయటానికి పూనుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు తన ప్రియురాలిపై అనుమానంతో అత్యంత ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రియురాలి బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసి, కేకు తినిపించిన తర్వాత ఆమె గొంతు కోశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని కనకపురకు చెందిన 24 ఏళ్ల నవ్య, ప్రశాంత్‌లు దూరపు చుట్టాలు. వీరిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు.
నవ్య పోలీస్ స్టేషన్‌లో క్లర్క్‌గా పని చేస్తోంది. నవ్య, ప్రశాంత్‌ల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. నవ్య వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని ప్రశాంత్ భావిస్తున్నాడు. ఆ వ్యక్తితోనే చాటింగ్ చేస్తోందని అనుకుంటూ ఉండేవాడు. ఇదే విషయమై నవ్యతో తరచుగా గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే నవ్య పుట్టిన రోజు వచ్చింది. ప్రశాంత్ ఆమె పుట్టిన రోజును ఘనంగా జరపాలని భావించాడు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశాడు. ఇద్దరూ బర్త్‌డే పార్టీ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే, మరికొన్ని క్షణాల్లో ప్రియుడే కాల యముడు అవుతాడని ఆమె ఊహించలేదు. నవ్య కేక్ కట్ చేసిన తర్వాత ప్రశాంత్ ఆమెకు కేకును తినిపించాడు.
తర్వాత కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య గురించి తెలిసిన ఇంటి పక్కలి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలి మీద అనుమానంతో అతడు ఈ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. మరి, నవ్య మీద అనుమానంతో పుట్టిన రోజు నాడే ఆమెను హత్య చేసిన ప్రశాంత్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.