ప్రస్తుతం ట్రెండ్ అంతా ఓటీటీ ప్లాట్ ఫాంలదే. ఇప్పటికే హాట్ స్టార్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి విదేశీ ఓటీటీ యాప్ ల హవా కొనసాగుతోంది. వాటికి పోటిగా.. నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో ఆహా పేరిట ఓటీటీ ప్లాట్ ఫాం తీసుకొచ్చారు. లెటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్, విభిన్నమైన టాక్ షోలతో కొద్ది కాలంలోనే టాప్ ప్లేస్ కు చేరుకుంది ఆహా. సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆహా యాప్ గురించి అల్లు శిరీష్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆహాతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు అల్లు శిరీష్. అయితే అతడు ఇలా ట్వీట్ చేయడానికి ఓ కారణం ఉంది.
ఆహా యాప్ లో ఏవైనా సమస్యలు తలెత్తితే.. సబ్ స్క్రైబర్లు ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే.. వెంటనే పరిష్కరించాల్సిందిగా.. ఆహా వీడియోస్ టీంతో పాటు.. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై స్పందించారు అల్లు శిరీష్.
తనను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ను షేర్ చేసి.. ‘‘డియర్ ఆహా వీడియోస్ టీం చాలా మంది నేను ఆహా బిజినెస్ లో భాగస్వామిని అనుకొని.. సమస్యల గురించి చెప్తూ.. నన్ను ట్యాగ్ చేస్తున్నారు. దయచేసి.. వారి సమస్యలను పరిష్కరించండి’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అల్లు కుటుంబానికి చెందిన ఈ యాప్ లో శిరీష్ కు భాగస్వామ్యం లేకపోవడం ఏంటి.. నాకు సంబంధం లేదని చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.
Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I’m involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr
— Allu Sirish (@AlluSirish) January 15, 2022
అయితే ఆహాలో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది భాగస్వాములుగా ఉన్నారు. ఐకాన్ స్టార్, అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆహా చేసే ప్రతి ఈవెంట్‌లోనూ అల్లు అర్జున్ భాగమవుతున్నాడు. అలాగే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా ఆహాకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్నాడు. ఇలా అల్లు వారి వారసులు ఆహాలో ఏదోకవిధంగా భాగమవుతున్నారు. అయితే ఇంతవరకు అల్లు శిరీష్ మాత్రం ఆహాలోని ఏ ఈవెంట్‌లో కనిపించకపోవడం గమనార్హం.