సాధారణంగా ఇండస్ట్రీ బయట ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే దాని గురించి కొంతకాలం స్పందించకపోవడం బెటర్ అని కొందరు అంటుంటారు. మరికొందరు స్పందించి ఏదొకటి నోరుజారడం వల్ల సమస్యలలో చిక్కుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. ఇలాంటి సమస్యలోనే చిక్కుకుందనే చెప్పాలి. కొద్దిరోజులుగా బాలీవుడ్ లో ‘బాయ్ కాట్’ ఏ స్థాయిలో ఉదృతం అవుతుందో చూస్తూనే ఉన్నాం. కొందరి సినిమాలు నోటి దురుసు వలన బాయ్ కాట్ అయ్యాయి.
ఇంకొందరి సినిమాలు కంటెంట్ లేనందువలన బాయ్ కాట్ అయ్యాయి. కొందరి సినిమాలు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో బాయ్ కాట్ చేస్కోండి.. అనడంతో కనీసం థియేటర్ ఖర్చులు కూడా రాబట్టలేని పరిస్థితి బాలీవుడ్ లో నెలకొంది. ఈ క్రమంలో స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’.. సెప్టెంబర్ 9న రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు మేకర్స్.
ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర సినిమాపై కూడా బాయ్ కాట్ ట్రోల్స్ మొదలయ్యాయి. రణబీర్, అలియా ఇద్దరు స్టార్ కిడ్స్ అని.. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అలియా బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందించింది. “నాకు స్టార్ కిడ్స్ అనే మాట విని విసుగు వచ్చేసింది. ఇంకా స్టార్ కిడ్స్ అని అంటున్నారు. నటిగా నేనెంటో నిరూపించుకుంటా. అయినా మీకు నా సినిమాలు నచ్చకపోతే చూడకండి. దాంట్లో నాకేం అభ్యంతరం లేదు” అని చెప్పుకొచ్చింది అలియా.
దీంతో ఇప్పుడు అలియా కామెంట్స్ పై పడ్డారు ట్రోలర్స్. ఇప్పటికే గతంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ చేసిన కామెంట్స్ వల్ల ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ మూవీ థియేటర్లలో చూసేవారే లేరు. ఇటీవల తాప్సి, అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ వల్ల దోబారా సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇలాంటి తరుణంలో నచ్చితే చూడండి.. లేకపోతే లేదని అంటే ఎలాగంటూ అలియా మాటలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి అలియా భట్ మాటలపై, బాయ్ కాట్ ట్రెండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.